ఈనాడుకి కడుపు మంట.. మంచి చేస్తుంటే ఓర్వలేకపోతోంది: మంత్రి రోజా ఫైర్‌

20 Dec, 2022 18:07 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సంక్షేమ సామ్రాట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి ఆర్కే రోజా కొనియాడారు. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా.. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరిగాయి. ఈ సంబరాలు ముగింపు కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్,  ఏపీ మీడియా సలహాదారు అలీ, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి అధ్యక్షురాలు వంగపండు ఉష హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..  తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు దినపత్రికపై మండిపడ్డారు. ఇది కళాకారులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంబరాలని, కానీ, ఈనాడుకి కళ్లు కనిపించడం లేదంటూ ఆమె విమర్శించారు. ‘‘రూ. 2.6 కోట్లు కేటాయించారంటూ కడుపు మంటతో వార్తలు రాస్తున్నారు. జీవో ఎక్కడ విడుదల చేసామో ఓసారి చూపించాలని ప్రశ్నిస్తున్నా. మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్న ఇలాంటోళ్లకు జెలెసిల్ బాటిల్స్ పంపించాల్సిందే’’ అని రోజా వ్యాఖ్యానించారు. 

ఇక నెలరోజుల పాటు నిర్వహించిన సంబరాల్లో 12 వేల మంది పోటీ పడ్డారని, 300 మంది విజేతలుగా నిలిచారని, విజేతలందరికీ ప్రత్యేక ఆకర్షితులుగా హాజరైన జబర్దస్త్‌ నటుల చేతుల మీదుగా బహుమతులు అందజేయిస్తున్నామని రోజా తెలిపారు. ప్రత్యేక ఆకర్షితులుగా హైపర్ ఆది, రాం ప్రసాద్, రోహిణి, అభి, చంటి, మహేష్,రాకేష్, ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు.

రోజా ఒకప్పటి అగ్రశ్రేణి నటి. నేడు అగ్రశ్రేణి రాజకీయనాయకురాలు . సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు . జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సంబరాలు నిర్వహించిన మంత్రి రోజాకు అభినందనలు. విజేతలకు శుభాకాంక్షలు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. 

మరుగున పడిపోతున్న కళలను వెలికి తీసే ప్రయత్నం చేయడం గొప్ప విషయం. మారుమూల ఉన్న కళాకారులను గుర్తించడం అభినందనీయమని మంత్రి కారుమూరి తెలిపారు. వైఎస్‌ జగన్ జన్మదినం సందర్భంగా సంబరాలు నిర్వహించిన మంత్రి రోజాకు అభినందనలు తెలియజేశారు. ఆపై ఈనాడు పేపర్, రామోజీరావు పై మంత్రి కారుమూరి మండిపడ్డారు.  కళాకారులను వెలికితీస్తుంటే ఈనాడు పేపర్ కు కడుపు మండిపోతుందని, రోజా సొంత ఖర్చుతో చేస్తుంటే జీవోలో రెండు కోట్లు కేటాయించినట్లు కథనాలు రాశారని, ఇలా రాయడానికి సిగ్గుందా? అని రామోజీరావును నిలదీశారు మంత్రి కారుమూరి. కళాకారులకు తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు మంత్రి కారుమూరి.

బియ్యపు గింజలపై జగనన్న సంక్షేమం
ఈ కార్యక్రమంలో.. జగనన్న సంక్షేమ పథకాలు ,26 జిల్లాల వివరాలు బియ్యపు గింజలపై చిత్రీకరించారు కారుమూరి మౌల్య పద్మావతి. పద్మావతి రూపొందించిన ఆర్ట్ ను మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు