చరిత్రకెక్కిన సామాజిక విప్లవం

10 Jul, 2022 05:16 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మునిసిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు (ఫైల్‌)

ప్లీనరీలో మంత్రులు వనిత, మేరుగ, వేణు, కారుమూరి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రవర్ణ పేదలకూ మేలు

సాధికారతలో జగన్‌కు ముందు.. తర్వాత

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో, ఊహకు అందని స్థాయిలో సామాజిక మహా విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌ సీపీ ప్లీనరీలో పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సాధికారత గురించి మాట్లాడుకుంటే వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాక ముందు.. జగన్‌ వచ్చాక అనే తరహాలో చరిత్రలో నిలుస్తుందని చెప్పారు.

శనివారం ప్లీనరీ సమావేశాల్లో సామాజిక సాధికారతపై హోంమంత్రి తానేటి వనిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రవర్ణ పేదలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేలు చేస్తున్నారని తెలిపారు.

అంతకు మించి అవకాశాలు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన దానికంటే అధికంగా సీఎం జగన్‌ అవకాశాలిచ్చారు. తొలి మంత్రివర్గంలో 60 శాతం, మలి విడత మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఆయా వర్గాలకే కేటాయించారు. బలహీనవర్గాలను బలవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. దళితులు దర్జాగా బతికేలా చేస్తున్నారు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తాం.. తోలు తీస్తాం అని చంద్రబాబు బెదిరిస్తే, టీడీపీ నేతలు మీకెందుకురా రాజకీయాలు? అంటూ ఎస్సీలను గేలి చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చంద్రబాబు కనీసం ఆలోచన కూడా చేయలేదు.     
– తానేటి వనిత, హోంమంత్రి

మానవత్వం చాటుకున్నారు
సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి జగన్‌. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎంతో మేలు జరిగింది. అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలంటే ఆయా వర్గాల్లోనే పుట్టాల్సిన పనిలేదు. ఏ వర్గంలో జన్మించినా సమాజం పట్ల బాధ్యత, పేదల పట్ల కరుణ, మానవత్వం ఉంటే చాలని సీఎం జగన్‌ నిరూపించారు.

మానవత్వమే నా కులం, మాట నిలబెట్టుకోవడమే నా మతం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఆయనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 2014లో టీడీపీ ఇచ్చిన 200 వాగ్దానాల్లో పది శాతాన్ని కూడా అమలు చేయలేదు. సీఎం జగన్‌ చేసిన వాగ్దానాల్లో నూటికి 96 శాతం అమలయ్యాయి. మనుషులనే కాదు.. చివరకు దయ్యాలను కూడా చంద్రబాబు మోసం చేయగలరు. 
– మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

సామాజిక విప్లవకారుడు 
సామాజిక సాధికారతను సీఎం జగన్‌ చేతల్లో చాటి చెప్పారు. బీసీలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన వాటాకు మించి పదవులు, ఫలాలు అందించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే బీసీలు తలెత్తుకుని నిలబడగలిగారు. దేశంలో సామాజిక విప్లవకారుడు ఒక్క వైఎస్‌ జగన్‌ మాత్రమే. ఇతర రాష్ట్రాలే కాకుండా కేంద్రానికి సైతం ఆయన పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బీసీల ఎదుగుదల చూసి ఓర్వలేక చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. ఆ విష ప్రచారాన్ని గడప గడపకు వెళ్లి తిప్పికొడతాం.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి

ఓటు వేయని వారికి కూడా..
తనకు ఓటు వేయని వారికి కూడా అర్హతే ప్రామాణికంగా మేలు చేకూర్చాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సామాజిక న్యాయం అక్కడే మొదలైంది. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వారిలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు ఎంతోమంది ఉన్నారు. మంత్రి పదవులే కాకుండా రాజ్యాంగ పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూర్చోబెట్టి గౌరవించిన గొప్ప నాయకుడు సీఎం జగన్‌. ఓ రిక్షా కార్మికుడి కుమారుడు దివంగత వైఎస్సార్‌ తెచ్చిన ఫీజుల పథకం వల్ల అమెరికాలోని చికాగోలో ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి బాటలోనే నడుస్తూ సంక్షేమ కార్యక్రమాలతో సీఎం జగన్‌ సామాజిక విప్లవం తెస్తున్నారు.
– కారుమూరి నాగేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మంత్రి 

మరిన్ని వార్తలు