ఈ పాపం బాబుది కాదా?

11 Jun, 2022 04:39 IST|Sakshi

ఆ రోజు ఎందుకు ప్రశ్నించ లేదు?

‘ఈనాడు’ పక్షపాత రాతలపై ఉప ముఖ్యమంత్రులు ముత్యాలనాయుడు, అంజాద్‌ బాషా, కలెక్టర్లు మండిపాటు

ఆ పాపాలన్నీ జగన్‌ ప్రభుత్వంపై మోపడమే పచ్చ పత్రిక లక్ష్యం

విశాఖ రహదారుల పాపం ముమ్మాటికీ గత ప్రభుత్వానిదే

పాత ఫొటోలతో ఈనాడు తప్పుడు కథనం

కడప రోడ్లకు నాడు రూపాయి నిధులివ్వలేదు

కోవిడ్‌ కారణంగానే మొన్నటిదాకా పనుల్లో జాప్యం

వైఎస్సార్‌సీపీ హయాంలో దశల వారీగా రహదారుల నిర్మాణం, మరమ్మతులు

ఒక్క జీవీఎంసీ పరిధిలోనే 3,200 చోట్ల రిపేర్లు

మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కడప కార్పొరేషన్‌: ‘గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయి. వాస్తవానికి నాడు ఎన్ని లోపాలున్నా, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నా, పచ్చ పత్రికలు ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే దశల వారీగా రహదారుల నిర్మాణం, మరమ్మతుల పనులు చేపట్టింది. ఇది చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు, వారికి బాకా ఊదే ఈనాడుకు గిట్టడం లేదు.

వాస్తవానికి రహదారులు ఇంత దారుణంగా ఉండటానికి కారణం గత చంద్రబాబు ప్రభుత్వమే. ఆ విషయాన్ని విస్మరించి.. అదే పనిగా ఉన్నవీ, లేనివీ కల్పించి ఈనాడు తప్పుడు కథనాలు రాస్తూ ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేస్తోంది’ అని విశాఖ, కడపలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, అంజద్‌ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ‘నగర రోడ్లపై నరక యాతన’ శీర్షికన శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన అవాస్తవాలతో కూడిన కథనాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

విశాఖలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీ శ, ఆర్‌డీవో డి.హుస్సెన్‌ సాహెబ్, వివిధ శాఖల అధికారులతో కలిసి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, కడపలో మేయర్‌ సురేష్‌ బాబు, జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌లతో కలిసి అంజాద్‌బాషాలు ఆయా కలెక్టరేట్లలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అవి పాత ఫొటోలు..
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోంది. విశాఖలో అవసరమైన మేరకు నిధులు కూడా కేటాయించాం. కానీ ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసింది. ద్వారకానగర్‌లో జూన్‌ 6వ తేదీలోపు రహదారులు వేశాం. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టాం. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో వార్తలు రాయడం దారుణం.

అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయి. దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయి. అవన్నీ సరిచేయిస్తున్నాం. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాల మేరకు పనులు చేపడుతున్నాం. అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించాం.

ఇందులో సుమారు 3,200 గుంతలను రూ.9 కోట్లతో మరమ్మతులు చేశాం. మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టాం’ అని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు వివరించారు. 

ఓర్వలేని రాతలవి..
‘కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఈనాడు ఓర్వలేకపోతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే.. మంచి చేస్తున్నారని మాట మాత్రమైనా చెప్పని పచ్చ పత్రికలు నాణేనికి ఒకవైపు మాత్రమే చూపిస్తూ దుష్ప్రచారం చేస్తుండటం అన్యాయం. రాష్ట్రంలో రూ.2300 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. కడపలో 74 రోడ్లను రూ.124.14కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం.

అందులో రూ.103.44 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కడపలో నిర్మిస్తున్న రాజీవ్‌ మార్గ్‌ రహదారి మొదట రూ.3.08 కోట్లతో మంజూరైంది. ఆ తర్వాత ఆ నిధులు చాలవని డీఎంఏ నిధుల నుంచి రూ.1.10 కోట్లు, కార్పొరేషన్‌ సాధారణ నిధుల నుంచి రూ.1.04 కోట్లు ఖర్చు చేసి సుమారు రూ.6కోట్లతో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం. కోవిడ్‌ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి.

ఈ రోడ్డులో 37 ఎన్‌క్రోచ్‌మెంట్లు ఉన్నాయి. వారందరినీ ఒప్పించి పనులు చేయడం కూడా ఆలస్యానికి కారణం. ఇప్పటికే 790 మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. అటువైపు ఫొటో తీయకుండా, మరో వైపు ఫొటో తీసి దుష్ప్రచారానికి తెరతీశారు. వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా రూపాయి నిధులివ్వలేదు. కార్పొరేషన్‌ సాధారణ నిధులు, కేంద్ర నిధులతోనే రోడ్లు నిర్మించాం’ అని అంజాద్‌ బాషా పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు