గురుమూర్తి గెలుపును సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలి

5 Apr, 2021 20:46 IST|Sakshi

నెల్లూరు: వైఎస్సార్సీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి గురుమూర్తి ఉన్నతమైన వ్యక్తి అని, అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా నెల్లూరులో సోమవారం మంత్రులు ప్రచారం చేశారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఋణం తీర్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి
పార్టీలకతీతంగా పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంట నడుద్దామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మేనిఫెస్టోని కనుమరుగు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అదే మేనిఫెస్టోలోని హామీలు నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న అదరణచూసే చంద్రబాబు జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి పారిపోయాడు అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకొని జగన్ ఋణం తీర్చుకోవాలని సూచించారు.

భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి బాలినేని
ఏడాదిన్నర పాలనలో ఊహించని సంక్షేమాన్ని ఇచ్చి సీఎం జగన్ పేదల పెన్నిధిగా నిలిచారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల పక్షపాతి అని కొనియాడారు. ఉప ఎన్నికలో హేమాహేమీలు నిలిచారని, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజా సంక్షేమాన్ని పనబాక గాలికి వొదిలేసారని గుర్తుచేశారు. ఇప్పుడు టీడీపీలో చేరి ఓట్లకు వస్తున్నారని చెప్పారు. సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో మెజారిటీ పెంచేందుకు ఆనం చేస్తున్న శ్రమ, కృషి అభినందనీయమని తెలిపారు.

గురుమూర్తి గుణమంతుడు: డిప్యూటీ సీఎం
గురుమూర్తి మంచి గుణమంతుడని, ఆ గుణాన్ని గమనించే ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ నిలిపారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. అతడిని అనూహ్య మెజారిటీతో గెలిపించి సంక్షేమ సారథి జగన్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. పచ్చమీడియాలో రాష్ట్రం అప్పులపాలైందని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది అని చెప్పారు. జగన్‌కి వస్తున్న జనాదరణ చూసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేసేస్తాడని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు