సామాజిక న్యాయంలో ఏపీ ఫస్ట్‌

19 Jul, 2021 07:53 IST|Sakshi

50 శాతానికి పైగానే అక్కచెల్లెమ్మలకు పదవులు 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలకు సువర్ణయుగం 

కొత్త తరం రాజకీయాలను తెస్తోన్న సీఎం వైఎస్‌ జగన్‌  

డిప్యూటీ సీఎంలు కృష్ణదాస్, నారాయణస్వామి, పుష్పశ్రీవాణి, అంజాద్‌ బాషా, మంత్రులు అప్పలరాజు, శంకరనారాయణ ప్రశంసలు 

సాక్షి అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: ‘అన్ని వర్గాల వారికి రాజకీయంగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలకు వైఎస్‌ జగన్‌ పాలన సువర్ణ యుగం’ అని పలువురు మంత్రులు కొనియాడారు. రాష్ట్రంలో శనివారం భర్తీ చేసిన 137 నామినేటెడ్‌ పదవుల్లో సగం మహిళలకు కేటాయించడంతో పాటు సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించడం సాహసోపేతం అని పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో  వారు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.  


సామాజిక సమన్యాయం  

నామినేటెడ్‌ పోస్టులను అన్ని వర్గాల వారికి అప్పగించి సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక సమన్యాయం చేశారు. కొత్తతరం రాజకీయాలకు జగన్‌ శ్రీకారం చుట్టారు. సామాజిక న్యాయంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.   
– శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి  
 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ సమానత్వం  
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ సమానత్వం లభించింది. నామినేటెడ్‌ పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు దక్కాయి. అధికారంలో ఉండగా డబ్బు తూకం పెట్టి పదవులను అమ్ముకున్న నీచ చరిత్ర చంద్రబాబుది.      
– తిరుపతిలో నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి   

 

మహిళా పక్షపాతిగా సీఎం జగన్‌ దేశానికే ఆదర్శం 
137 నామినేటెడ్‌ పదవుల్లో 50.4 శాతం అంటే.. 69 పదవులను మహిళలకు కట్టబెట్టడం ద్వారా.. తాను మహిళా పక్షపాతిననే విషయాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించుకుని దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఒక మహిళను ఉప ముఖ్యమంత్రిగా, మరో మహిళను హోం మంత్రిగా నియమించడమే కాకుండా.. 56 బీసీ కార్పొరేషన్‌ పదవుల్లోనూ సగం మహిళలకే ఇచ్చారు.     
– పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి   


స్వతంత్ర భారతంలో రికార్డు  
74 ఏళ్ల స్వతంత్ర భారతంలో అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం, పదవుల్లో సమతుల్యత ఇప్పుడు ఏపీలో సాధ్యమైంది. నమ్మిన సిద్ధాంతాన్ని చేతల్లో చూపిస్తూ 137 నామినేటెడ్‌ పదవుల్లో 79 పదవులు అట్టడుగు వర్గాలకు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దే. ఒక్క మైనార్టీలకే 12 నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం గర్వకారణం.
– కడపలో అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి   
 

గాంధీజీ, పూలే, అంబేడ్కర్‌ ఆశయాల కొనసాగింపు  
రాష్ట్ర ప్రజల మనసు, సమస్యలు తెలిసిన ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్‌. అధికారంలోకి రాగానే బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. ఇందుకు నిదర్శనం.. కురుబ కులానికి చెందిన నాకు కీలకమైన మంత్రి పదవి ఇవ్వడమే. గాంధీ, పూలే, అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం పాలన సాగిస్తున్నారు.  
– అనంతపురంలో శంకరనారాయణ, ఆర్‌అండ్‌బీ మంత్రి  
 

చంద్రబాబుకు మాటల్లేవ్‌  
14 ఏళ్ల పాలనలో ఏనాడైనా చంద్రబాబు సామాజిక న్యాయం పాటించారా? ఎన్నికల ముందు ప్రచారం కోసం బీసీలను, ఎస్సీ, ఎస్టీలను వాడుకున్నారు తప్ప వారికేం గౌరవం ఇవ్వలేదు. సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం.. సీఎం జగన్‌ సాధించిన విజయాల్లో ముందు వరుసలో ఉంటాయి.
– శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖ మంత్రి

మరిన్ని వార్తలు