మళ్లీ వరదొచ్చినా భయం లేదు  

21 Aug, 2020 12:38 IST|Sakshi
వేలేరుపాడు మండలంలో వరద బాధితులను పరామర్శించేందుకు ఒండ్రు మట్టిలో నడుచుకుంటూ వెళుతున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

 ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

వరద బాధితులకు మంత్రుల భరోసా   

వేలేరుపాడు: ‘మళ్లీ గోదావరికి వరదొచ్చినా భయం లేదు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎవరూ అధైర్యపడొద్దు. అండగా ఉంటాం. ఆదుకుంటాం’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతమైన వేలేరుపాడు మండలంలో రుద్రమకోట, రేపాకగొమ్ము గ్రామాల్లో గురువారం వారిద్దరూ పర్యటించారు. బాధితులను పరామర్శించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భద్రాచలం వద్ద వరద పెరిగినా బాధితులు  భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామని వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో  102 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 13 వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయని వివరించారు.

38 సహాయక శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 10వేల మంది వరద బాధితులను సహాయక శిబిరాలకు తరలించామని వెల్లడించారు. మిగిలిన వారికి కొండప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశామని వివరించారు. నిరాశ్రయులు ప్రతిఒక్కరికీ 5కేజీల బియ్యం, ఐదు రకాల కూరగాయలు అందించినట్టు చెప్పారు. సహాయక కేంద్రాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బాధితులకు ముందస్తుగా రూ.2,000 సాయం అందించనున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో ఇళ్లను సర్వే చేసి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,000, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5,500 ఇవ్వనున్నట్టు వివరించారు. ప్రతి వ్యక్తికీ ఐదుకిలోల నాణ్యమైన బియ్యం,  కిలో కందిపప్పు,  రెండు లీటర్ల కిరోసిన్, లీటరు మంచినూనె అందించనున్నట్లు చెప్పారు. పంటలు నష్టపోయిన రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందిస్తామని చెప్పారు.   

వరద బాధితులతో మమేకమై..  
మంత్రి పేర్ని నాని వరద బాధితులతో కాసేపు మాట్లాడారు. వారిలో ఒకరిగా కలిసిపోయారు.  భారీ వర్షంలో.. జర్రున జారే మోకాల్లోతు ఒండ్రు మట్టిలోనే రుద్రమకోట, రేపాక గొమ్ము గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఏ మాత్రం హంగూ ఆర్భాటం లేకుండా నిరాశ్రయులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితులుగా తాము కాలనీలకు తరలిపోవాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి తమకు మెరుగైన ప్యాకేజీ అందించాలని నిరాశ్రయులు కోరారు. ముఖ్యమంత్రి జగన్‌ తప్పకుండా అన్ని కుటుంబాలనూ ఆదుకుంటారని పేర్ని వారికి భరోసా ఇచ్చారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్‌ ముత్యాలరాజు, జేసీ వెంకటరమణారెడ్డి, ఐటీడీఏ  పీఓ సూర్యనారాయణ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సందీప్, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌కుమార్, వైఎస్సార్‌ సీపీ నాయకులు కామినేని వెంకటేశ్వరావు, కేసగాని శ్రీనివాసగౌడ్, గుద్దేటి భాస్కర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు