3 పోర్టులు.. 13 రహదారులు: ఏపీ మరో ముందడుగు

14 Aug, 2021 12:51 IST|Sakshi

రాష్ట్రంలో కార్గో రవాణా మరింత విస్తృతం

విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు జాతీయ రహదారితో అనుసంధానం

రూ.7,876.56 కోట్లతో 277.25 కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనలకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి దిశగా ముందడుగు పడింది. మూడు ప్రధాన పోర్టులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా లాజిస్టిక్స్, కార్గో రవాణా రంగాల అభివృద్ధి పుంజుకోనుంది. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 13 కొత్త రహదారులను నిర్మించనున్నారు. ఈ రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలతో పాటు మూడు సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఊపందుకోనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదముద్ర వేసింది. 

277.25 కి.మీ. రోడ్ల నిర్మాణం..
నాలుగు లేన్లు, ఆరు లేన్ల రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో మొత్తం రూ.7,876.56 కోట్లతో 277.25 కిలోమీటర్ల మేర కొత్తగా 13 రోడ్లను నిర్మించనున్నారు. ఇప్పటికే 6 రోడ్లకు డీపీఆర్‌లు పూర్తి కాగా, మరో 7 రోడ్లకు డీపీఆర్‌లను రూపొందిస్తున్నారు. డీపీఆర్‌లు ఖరారు చేసిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు. ఏడాదిన్నరలో ఈ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. ఈ రోడ్ల నిర్మాణం కోసం భూసేకరణ, తదితర విషయాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది.

లక్ష్యం ఇదీ..
ఆగ్నేయాసియా దేశాల నుంచి ఎగుమతి, దిగుమతులకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను గేట్‌ వేలు మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఎగుమతి, దిగుమతులకు మన రాష్ట్రంలోని ఈ మూడు పోర్టులే కీలకం. అందుకే ఈ మూడు పోర్టుల నుంచి తక్కువ సమయంలో, తక్కువ ఇంధన వ్యయంతో చేరేందుకు వీలుగా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఈ రహదారుల నిర్మాణానికి నిర్ణయించింది. 

మూడు మార్గాల్లో అనుసంధానం
కొత్తగా నిర్మించే 13 రహదారుల్లో ఆరు రహదారులు విశాఖ పోర్టును మూడు మార్గాల్లో జాతీయ రహదారి–16తో అనుసంధానిస్తారు. వాటిలో విశాఖపట్నం పోర్టు నుంచి బీచ్‌ రోడ్డు మీదుగా భోగాపురం వరకు 4 లేన్ల రహదారి ఉండటం విశేషం. తద్వారా త్వరలో నిర్మాణం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విశాఖ పోర్టుతో అనుసంధానించడం సాధ్యపడుతుంది. మరో నాలుగు రహదారులు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టును ఎన్‌హెచ్‌–16తో అనుసంధానిస్తారు. దాంతో అటు రాయలసీమతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి కార్గో రవాణాకు మార్గం సుగమమవుతుంది. మూడు రహదారులను కాకినాడ పోర్టును ఎన్‌హెచ్‌–16తో అనుసంధిస్తారు.

పూర్తి సహకారం అందిస్తాం
రాష్ట్రంలో లాజిస్టిక్స్, కార్గో రవాణా రంగాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా మూడు పోర్టులను అనుసంధానిస్తూ ఈ 13 రహదారుల నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి కొంతకాలం కిందట ప్రతిపాదించారు. ఈ రహదారుల ఆవశ్యతను సమగ్రంగా వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. ఈ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తున్నాం.
– ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాల శాఖ  

మరిన్ని వార్తలు