నేతల ఇలాకాల్లోనూ పరాభవమే

15 Mar, 2021 03:29 IST|Sakshi

మున్సిపల్‌ ఎన్నికల్లో సైకిల్‌ కకావికలం 

పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కూడా ప్రభావం నిల్‌ 

సొంత జిల్లాలో చంద్రబాబుకు తీరని అవమానం

బాలయ్య కోటలో వైఎస్సార్‌సీపీ పాగా  

రెండు మున్సిపాల్టీల్లో చేతులెత్తేసిన చినరాజప్ప 

యనమలను పట్టించుకోని తుని ప్రజలు

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ ఎన్నికల కంటే  ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. 13 జిల్లాల్లో ఎక్కడా ప్రభావం చూపలేక చేతులెత్తేసింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల ఫలితాల్లో ఒక్కచోట (తాడిపత్రి) మినహా అన్నిచోట్లా మట్టికరిచింది. 11 కార్పొరేషన్లలో 9 చోట్ల సింగిల్‌ డిజిట్‌ డివిజన్లు, 75 మున్సిపాల్టీల్లో 58 చోట్ల సింగిల్‌ డిజిట్‌ వార్డులకే పరిమితమైందంటే టీడీపీ ఓటమి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింగిల్‌ డిజిట్‌ నెంబర్లోనూ అనేక చోట్ల దక్కింది ఒకటి, రెండు వార్డులే. 12 మున్సిపాల్టీల్లో ఆ పార్టీ అసలు ఖాతా తెరవలేదు. చంద్రబాబు ఎన్నో ప్రగల్భాలు పలికి వ్యక్తిగత విమర్శలకు దిగినా ఈ ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఎంత దుష్ప్రచారం చేసినా టీడీపీని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు చెప్పే మాటలు, చేసే పనులన్నీ మీడియా కోసమేనని, ఆయనకు ఏమాత్రం ప్రజాదరణ లేదని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

మున్సిపాల్టీల్లో సైకిల్‌ పల్టీ
టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు సొంత మున్సిపాల్టీ తునిలో ఒక్క వార్డును కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల్లోనూ ఓటమి పాలైంది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ గెలుస్తున్న, ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్న మండపేటలోనూ నెగ్గలేకపోవడం గమనార్హం. పశ్చిమ గోదావరిలో ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాల్టీలకు గానూ ఒక్క చోట కూడా డబుల్‌ డిజిట్‌ వార్డులు సాధించలేకపోయింది. తూర్పు గోదావరిలో ఎన్నికలు జరిగిన పది మున్సిపాల్టీల్లోనూ సింగిల్‌ డిజిట్‌ వార్డులకే పరిమితమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మున్సిపాల్టీల్లో టీడీపీ నామరూపాలు లేకుండాపోయింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ రేపల్లె మున్సిపాల్టీని గెలిపించుకోలేకపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ టీడీపీని కాపాడలేకపోయారు.

చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీ చతికిలపడింది. టీడీపికి చెందిన మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అమర్‌నాథ్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాస్‌ తదితరులు సొంత నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీల్లోనూ ప్రభావం చూపలేకపోయారు. డోన్, వెంకటగిరి, ధర్మవరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కనిగిరి, పులివెందుల, పిడుగురాళ్ల, మాచర్ల, పుంగనూరు మున్సిపాల్టీల్లో టీడీపీ గుడ్లు తేలేసింది. మొత్తంగా మున్సిపల్‌ ఎన్నికలు టీడీపీకి శరాఘాతంలా మారాయి. పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తామే విజయం సాధించామని శ్రేణుల్ని మభ్యపుచ్చిన చంద్రబాబు అసలు రంగు ఈ ఎన్నికల్లో బయటపడిందని పేర్కొంటున్నారు. 

కర్నూలులో బడా నేతలకు షాక్‌
కర్నూలు(అర్బన్‌): టీడీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఒక వెలుగు వెలిగిన నేతలకు ప్రస్తుత మునిసిపల్‌ ఎన్నికల్లో ‘ఫ్యాన్‌’ షాక్‌ ఇచ్చింది. టీడీపీ హయాంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత టీజీ వెంకటేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాసాలు కర్నూలు నగరంలోని 49వ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. అయితే ఈ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కృష్ణకాంత్‌రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి నివాసముంటున్న 13వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.విజయలక్ష్మి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నివాసం ఉంటున్న 20వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏ నాగలక్ష్మిరెడ్డి గెలుపొందారు. నంద్యాలలో మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ నివాసమున్న 10వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అబ్దుల్‌మజీద్‌ విజయం సాధించారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసమున్న 8వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోబీన్‌ గెలుపొందారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నివాసమున్న 27వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ రఘు గెలుపొందారు. సీపీఎం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది.

ఎవరూ నిరుత్సాహపడొద్దు
మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌ నుంచి ఈ ట్వీట్‌ చేశారు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలున్నా గట్టిగా పోరాడినట్టు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రానున్న రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, కొన్ని చోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టారని, అందరి పోరాట స్ఫూర్తికి వందనాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు