‘నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి’

19 Oct, 2020 18:32 IST|Sakshi
సిద్దవటం యానాదయ్య

ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు

సాక్షి, కడప (వైఎస్సార్‌ జిల్లా): సామాన్య కార్యకర్త అయిన తన​కు రాష్ట్ర చైర్మన్ పదవి దక్కడం పట్ల నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల ఆర్థిక, సామాజిక లబ్ది కోసం 56 బీసీ కులాల వారికి లబ్ది చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు. తోకలు కట్ చేస్తాం, తాట తీస్తాం అన్న సచివాలయంలోనే తల ఎత్తుకుని తిరిగేలా సీఎం వైఎస్ జగన్ తమకు పదవి ఇచ్చారని అన్నారు. (చదవండి: 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు)

తన పదవికి తప్పకుండా న్యాయం చేస్తానని, నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీయిచ్చారు. తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి, జిల్లాలోని శాసనసభ్యులకు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. కాగా, యానాదయ్యను రాష్ట్రస్థాయి పదవిలో నియమించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

నాయీ బ్రాహ్మణ చైర్మన్‌
పేరు: సిద్దవటం యానాదయ్య
విద్యార్హత: బిఏ
పుట్టిన తేది: 01–07–1968
తల్లిదండ్రులు: రామయ్య, పిచ్చమ్మ
భార్య: వెంకటసుబ్బమ్మ
పిల్లలు: శ్రీహరి, రెడ్డి వైష్ణవి
స్వగ్రామం: అత్తిగారిపల్లె, పెనగలూరు (మండలం)
రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నాయకుడిగా ఉంటూ నాయీ బ్రాహ్మణ సంఘంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకూ 25 ఏళ్లు పనిచేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి అటు జిల్లాలో, రాష్ట్రంలో పలు ఉద్యమాలు చేశారు. 2009లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేసే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు