పల్లె గూటికి పండగొచ్చింది

4 Apr, 2021 03:50 IST|Sakshi
గుంటూరు జిల్లా గోగులపాడులో ప్రమాణ స్వీకారం చేస్తున్న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు

బాధ్యతలు చేపట్టిన కొత్త సర్పంచ్‌లు

సాక్షి, అమరావతి: కొత్త సర్పంచ్‌లు కొలువుదీరడంతో పల్లె గూటికి పండగొచ్చింది. రెండున్నరేళ్ల తరువాత పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల్లో శనివారం నుంచి ప్రజా పాలన తిరిగి మొదలైంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌.. వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,099 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా గెలిచిన 1.33 లక్షల మంది బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన తొలి పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల పాలన మొదలైంది. టీడీపీ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో కొత్త పాలకులు బాధ్యతలు చేపట్టారు.

పల్లెకు కొత్త రూపు తెస్తా 
గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని గాంధీ చెప్పిన మాటలు నిజం చేసేలా పల్లెకు కొత్త రూపు తీసుకువస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించడంతో పాటు మరిన్ని పనులు చేపట్టేలా ప్రణాళిక తయారు చేసుకుంటున్నా. పచ్చదనం, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుదల దిశగా మొదటి అడుగులేస్తున్నాం.    
– బీరం ఉమా, సర్పంచ్, తిమ్మారెడ్డిపల్లె, వైఎస్సార్‌ జిల్లా

ప్రజావసరాలపై ప్రత్యేక దృష్టి 
23 ఏళ్ల వయసులో నాకు గ్రామ సర్పంచ్‌గా అవకాశం వచ్చింది. ఇంటింటికీ తాగునీరు అందించడం నా ముందున్న ప్రధాన లక్ష్యం. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతా. గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటు ప్రభుత్వ వైద్యుడి నియామకం జరిగేలా కృషి చేస్తా. 
– ఎల్ల రాముడు, సర్పంచ్, గోవర్ధనగిరి, కర్నూలు జిల్లా

జగనన్న అడుగుజాడల్లో నడుస్తా 
మొదటిసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యా. పాలనలో మహిళలకు అధిక రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటా. ముఖ్యమంత్రి అడుగు జాడల్లో నడిచి.. ఆయన ఆశయం మేరకు సంక్షేమ పాలనను కొనసాగిస్తాను. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.   
 – బోయ శృతి, సర్పంచ్,కెంచానపల్లి, అనంతపురం జిల్లా 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు