ఎస్‌ఈసీ మొండి వైఖరి.. ఎన్నికల విధులు బహిష్కరిస్తాం

9 Jan, 2021 11:56 IST|Sakshi

ఎన్నికల కమిషనర్‌ తీరుపై ఉద్యోగ సంఘాల విమర్శలు

సాక్షి, అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతోందని ఇలాంటి సమయంలో నోటిషికేషన్‌ విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేసిన విషయం తెలిసిందే.(చదవండి: నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం)

ఈ విషయంపై స్పందించిన చంద్రశేఖర్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలు దఫాలుగా ఎన్నికల కమీషనర్‌కు తెలియజేశాం. సీఎస్ కూడా ఇదే విషయాన్ని ఆయనకు వివరించారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికం. తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాల్లో ఎన్నికల తరువాత కరోనా వ్యాపించింది. ఎన్నికల కమీషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనాతో భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పాలన కుంటుపడలేదు. 9లక్షల కు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తాం’’ అని పేర్కొన్నారు.

వ్యవస్థ కోసం పనిచేయాలి కానీ..
నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్‌బాబు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ప్రభుత్వ అభ్యర్థనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికల కమిషన్‌ వ్యక్తుల కోసం కాదు.. వ్యవస్థ కోసం పనిచేయాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు