అరుదైన రికార్డ్‌.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌

13 Sep, 2022 18:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: సంక్షేమంలో ఇప్పటికే అనేక రికార్డుల్ని నెలకొల్పిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. మరో వైపు పారిశ్రామిక వృద్ధిలోనూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.. డీపీఐఐటీ రూపొందించిన నివేదిక ఏపీ సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పింది. దేశంలో గడిచిన ఏడు నెలల్లో ఏ రాష్ట్రం సాధించనన్ని పెట్టుబడులను ఏపీ సాధించినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఒడిశా రాష్ట్రం నిలిచింది. దేశం మొత్తం మీద గత ఏడు నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 45 శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలే సాధించాయి.
చదవండి: వైద్యం, ఆరోగ్యం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు 

అందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 40 వేల 361 కోట్ల  పెట్టుబడుల్ని సాధించి నంబర్ వన్ గా నిలిచింది. ఈ ఏడు నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కలిసి లక్షా 71 వేల 285 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో ఏపీ, ఒడిశాలో 45 శాతం వచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకమైన పారిశ్రామిక విధానాలను అమలుచేయడంతో ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. దీంతో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో అగ్రగామిగా నిలిచింది. 

ఎంఓయూలను వాస్తవిక పెట్టుబడులుగా మలచడంలోనూ దేశంలో మొదటి స్థానంలో ఏపీ ఉంది. ఎగుమతుల్లోనూ ఏడో స్థానం నుండి నాలుగో స్థానానికి రాష్ట్రం ఎదిగింది. ఇవన్నీ కేవలం సీఎం జగన్ గత మూడేళ్ల పాలనా సంస్కరణలు, నిర్ణయాల వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో గత ఏడు నెలల్లో అగ్రస్థానంలో నిలిచిందని ప్రకటించింది.

కొద్ది రోజుల కిందట జరిగిన కేబినెట్ సమావేశంలోనూ ఏపీ ప్రభుత్వం లక్షా 26 వేల 748 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు, ఎనర్జీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రాబోయే ఏడేళ్లలో 40 వేల 330 ఉద్యోగాలు రానున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు ఏపీకి వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు