నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన బాలకృష్ణ.. ఏమన్నారంటే?

6 Feb, 2023 13:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఓ టీవీ ఛానల్‌ ప్రోగ్రాంలో  సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్‌స్టాపబుల్‌ అనే కార్యక్రమంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నర్సులు నిరసనలు తెలుపుతున్నారు. 

కాగా, నిరసనల సందర్భంగా నర్సులు బాలకృష్ణ, పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బాలకృష్ణ వ్యాఖ్యలను సమర్థించిన పవన్‌ కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలి. నర్సులను బాలకృష్ణ కించపరిస్తే పవన్‌ ఎందుకు ఖండించలేదు?. మహిళలకు పవన్‌ కల్యాణ్‌ ఏం న్యాయం చేస్తాడు?. బాలకృష్ణ తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. కరోనా సమయంలో కుటుంబాలను వదిలి, ప్రాణాలకు తెగించి సేవ చేశాము. నర్సింగ్‌ ప్రొఫెషన్‌ను తక్కువ చేసి చూడకండి అని కోరారు. 

ఇక, తన వ్యాఖ్యలపై తాజాగా బాలకృష్ణ స్పందించి వివరణ ఇచ్చారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. నా వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. రోగులకు సేవలు అందించే నర్సులంటే తనకు గౌరవం అని తెలిపారు. నర్సుల మనోభావాలు దెబ్బతిస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు