-

నంద్యాలలో తల్లి పులి ఉత్కంఠ: కీలక పరిణామం.. దేశ చరిత్రలోనే తొలిసారిగా..

8 Mar, 2023 13:58 IST|Sakshi

సాక్షి, నంద్యాల: తల్లిపులి దగ్గరికి పులి పిల్లలను చేర్చడం అనే ఆపరేషన్‌ ద్వారా.. దేశ చరిత్రలోనే తొలిసారి ఈ తరహా ప్రయత్నానికి ఏపీ వేదిక అయ్యింది. అలాగే నంద్యాల జిల్లాలో తల్లి పులి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అయితే.. తాజాగా ఆపరేషన్ తల్లి పులిలో కీలక పరిణామం చోటు చేసుకుందని ఆపరేషన్‌ కమిటీ మెంబర్‌, డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ ఆప్పవ్ ఐఎఫ్‌ఎస్‌ పేర్కొన్నారు.  

పెద్ద గుమ్మాడాపురం అటవీప్రాంతంలోపెద్ద పులి అడుగుజాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించినట్లు విగ్నేష్‌ తెలిపారు. అయితే.. అది తల్లి పులి (T108 F)వి అవునా? కాదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. మరోవైపు 50కిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో ఆపరేషన్‌ తల్లి పులి నిర్వహిస్తున్నట్లు తెలిపారాయన.  పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారాయన. 

శాస్త్రీయంగాను సాంకేతికంగా తల్లి పులికోసం గాలిస్తున్నాం. దాదాపు 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేస్తున్నాము. అవసరాన్ని బట్టి డ్రోన్ కూడా వినియోగిస్తాం అని తెలిపారాయన. నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం చేత ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నాం. నిపుణుల సూచనల మేరకు పులికూనలకు పాలు, సెరోలాక్ తో పాటు ఇవాళ (బుధవారం) చికెన్ లివర్ ముక్కలను అందించాం అని తెలిపారాయన.

మరిన్ని వార్తలు