ఎన్నికల ఘట్టం.. వైఎస్‌ కుటుంబానికే పట్టం..

24 Feb, 2021 09:59 IST|Sakshi

ఆది నుంచి ఏ ఎన్నికలు జరిగినా  ప్రజల సంపూర్ణ మద్దతు 

ప్రతిసారి అండగా నిలబడుతున్న పులివెందుల నియోజకవర్గ ప్రజలు 

1978 నుంచి ఇప్పటివరకు తిరుగులేని రికార్డు 

ఈసారి పంచాయతీల్లోనూ క్లీన్‌ స్వీప్‌ 

సాక్షి కడప: వైఎస్‌ కుటుంబమంటే ఎనలేని ప్రేమ.. ఆది నుంచి తెలియని అభిమానం.. ఆ కుటుంబం కోసం ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా ఇచ్చే జనం.. కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా.. చివరకు సుఖం వచ్చినా..వైఎస్‌ కుటుంబానికి చెప్పి పంచుకోవడం ప్రజలకు అలవాటు. ఎన్నో ఏళ్లుగా పులివెందుల ప్రజలు  ఆ కుటుంబం వెంట నడుస్తున్నారు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. దాదాపు కొన్ని ఏళ్ల తరబడి ఎలాంటి ఎన్నికలు వచ్చినా వైఎస్‌ కుటుంబానికి పులివెందుల ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. ఎన్నిక ఏదైనా సరే ఓటరు తీర్పు మాత్రం వారివైపే ఉంటుంది. అడగకుండా అమ్మయినా అన్నం పెట్టదంటారు...అలాంటిది ఏమీ అడగకుండానే అండగా నిలిచిన పులిందుల ప్రజల రుణం తీర్చుకునేందుకు వైఎస్‌ కుటుంబం అన్నీ చేసి పెడుతోంది. అందుకే ప్రజలకు ఆ కుటుంబంపై ఇప్పటికీ మమకారం తీరలేదు.      

1978 నుంచి ఇప్పటివరకు తిరుగులేని రికార్డు 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల చరిత్రలో ఎన్నో  మైలురాళ్లు. ఓటమి ఎరుగని నేతగా పులివెందుల గ(బి)డ్డగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. పులివెందులలో దివంగత వైఎస్‌ రాజారెడ్డి హయాం నుంచి ప్రజల కష్టాల్లో వైఎస్‌ కుటంబం పాలుపంచుకుంటూ వస్తుండడంతో ఇప్పటికీ ఆ కుటుంబమంటే ప్రజలకు చాలా మక్కువ. 1978 నుంచి ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ వైఎస్‌ కుటుంబానికి ప్రజలు బాసటగా నిలుస్తూ వస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలైనా సరే...పులివెందులలో మాత్రం  వైఎస్‌ కుటుంబానికి కంచుకోట అని ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. 2011లో ఎంపీగా ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని 5.40 లక్షల పైచిలుకు భారీ మెజారీ్టతో గెలిపించి ఢిల్లీ పెద్దలు అదిరిపోయి పులివెందుల వైపు చూసేలా చేశారు. ప్రతి ఎన్నికలలోనూ ప్రజలు మాత్రం వైఎస్‌ కుటుంబానికి అండగా నిలుస్తూ  పట్టం కడుతున్నారు. వైఎస్‌ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ ప్రజల పట్ల విధేయత చూపుతూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలను కూడా సొంత మనుషుల్లా చూస్తున్నారు. అందుకేనేమో మొక్కవోని అభిమానంతో ఏళ్ల చరిత్రలో  ప్రజలు రికార్డుల మీద రికార్డులు మోగిస్తున్నారు.  

పులివెందులలో క్లీన్‌ స్వీప్‌ 
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తాజాగా  జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలపై ఉన్న ప్రేమను ఓట్ల రూపంలో అందించారు. ప్రత్యేకంగా పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, తొండూరు మండల ఇన్‌చార్జి వైఎస్‌ మధురెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి, లింగాల, సింహాద్రిపురం మండలాల ఇన్‌చార్జి నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి జరిపిన చర్చలు కూడా సత్ఫలితాలు ఇచ్చాయి. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కూడా పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించడంతో 108 చోట్ల అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మచ్చుకైనా కనిపించకుండా అడ్రస్‌ గల్లంతు అయిందంటే ప్రజలకు వైఎస్‌ కుటుంబంపై ఉన్న ఎనలేని అభిమానాన్ని తేట తెల్లం చేస్తోంది.

చదవండి: పులివెందుల ‘పంచ్‌’ అదిరింది

మరిన్ని వార్తలు