30 పంచాయతీలు ఏకగ్రీవం

5 Feb, 2021 11:49 IST|Sakshi

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం

ఎన్నికలు జరిగే పంచాయతీలు 336

బరిలో నిలిచిన సర్పంచ్‌ అభ్యర్థులు 934 మంది

సాక్షి, రాజమహేంద్రవరం: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల ఘట్టం గురువారం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులెవరనేది తేలింది. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో తొలి విడత 366 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవులకు, 4,100 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 30 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. కరప మండలం ఉప్పలంక గ్రామంలో మాత్రం సర్పంచ్‌ పదవి ఏకగ్రీవమవగా వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన 29 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ సహా వార్డు సభ్యుల పదవులన్నీ ఏకగ్రీవం కావడం విశేషం. గ్రామాభివృద్ధికి తోడ్పాటునివ్వాలనే సంకల్పంతో ఆ గ్రామాల్లో అందరూ ఒకే మాటపై నిలబడటంతో ఏకగ్రీవాలు సాధ్యమయ్యాయి. మాట పట్టింపులతో పోటాపోటీగా దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి వరకూ చేసిన ప్రయత్నాలు కొన్నిచోట్ల ఫలితాన్నిచ్చాయి.

మాట పట్టింపులకు పోయి విభేదాలు, వర్గ వైషమ్యాలకు తావు ఇవ్వకుండా గ్రామాభివృద్ధికి కలిసి రావాలనే పెద్దల మాటకు కట్టుబడి పలువురు సర్పంచ్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మరికొన్నిచోట్ల సర్దుబాటు చేయాల్సి రావడం పెద్దలకు తలపోటు తెచ్చి పెట్టింది. పంచాయతీల్లో స్థానికంగా పెద్దలు కల్పించుకుని గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలని బుజ్జగిస్తున్నారు. అత్యధికంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల పదవులు కూడా ఏకగ్రీవమయ్యాయి. రెండో అత్యధిక స్థానాలు ఏకగ్రీవమైన నియోజకవర్గంగా కాకినాడ రూరల్‌ నిలిచింది. ఈ నియోజకవర్గంలో ఆరు గ్రామాల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. తుని, జగ్గంపేట నియోజకవర్గాల్లో నాలుగు చొప్పున, పిఠాపురం నియోజకవర్గంలో మూడు, ముమ్మిడివరం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి, అనపర్తి నియోజకవర్గంలో మూడు పంచాయతీ సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 

తొలి పోరులో గెలుపెవరిదో.. 
ఈ నెల 9న జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల అనంతరం గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందనే చర్చ పల్లెల్లో రసవత్తరంగా జరుగుతోంది. ఎనిమిది నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యేసరికి చాలాచోట్ల ముఖాముఖి పోరే ఎక్కువగా కనిపిస్తోంది. 
⇔ తుని నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే 58 సర్పంచ్‌ పదవులకు నాలుగు ఏకగ్రీవం కాగా, మిగిలిన 54 పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 148 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో 30 పంచాయతీల్లో ముఖాముఖి, 17 చోట్ల త్రిముఖ పోరు, ఏడుచోట్ల బహుముఖ పోటీ జరుగుతోంది. 
⇔ ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 16 పంచాయతీల్లో 42 మంది బరిలో నిలిచారు. ఎనిమిది పంచాయతీలకు ముఖాముఖి, ఏడుచోట్ల త్రిముఖ పోరు, ఒక చోట బహుముఖ పోరు జరుగుతోంది. 
⇔ అనపర్తి నియోజకవర్గం పెదపూడి, రంగంపేట మండలాల్లో 36 పంచాయతీలకు మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 32 గ్రామాల్లో పోరుకు తెర లేచింది. ఈ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి 72 మంది బరిలో నిలిచారు. 21 పంచాయతీల్లో ముఖాముఖి, తొమ్మిది చోట్ల త్రిముఖం, రెండుచోట్ల బహుముఖ పోరు జరుగుతోంది. 
⇔ కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో 35 పంచాయతీలకు గాను ఆరు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29 సర్పంచ్‌ పదవులకు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 83 మంది పోటీ పడుతున్నారు. వీటిలో 15 పంచాయతీలకు ముఖాముఖి, తొమ్మిదిచోట్ల త్రిముఖం, ఐదు పంచాయతీల్లో బహుముఖ పోరు జరుగుతోంది. 
⇔ పెద్దాపురం నియోజకవర్గంలో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 40 పంచాయతీల్లో 114 మంది బరిలో నిలిచారు. 19 చోట్ల ముఖాముఖి, 10 చోట్ల త్రిముఖం, 11 పంచాయతీల్లో బహుముఖ పోరుకు తెర లేచింది. 
⇔ ప్రత్తిపాడు నియోజకవర్గంలో 75 గ్రామ పంచాయతీలుండగా ఎనిమిది ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 67 పంచాయతీల్లో అత్యధికంగా 202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 33 పంచాయతీల్లో ముఖాముఖి, 21 చోట్ల త్రిముఖం, 13 చోట్ల బహుముఖ పోరు జరుగుతోంది. 
⇔ జగ్గంపేట నియోజకవర్గంలో 53 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 49 పంచాయతీల్లో పోటీ జరుగుతోంది. 141 మంది బరిలో నిలిచారు. 
పిఠాపురం నియోజకవర్గంలో 52 పంచాయతీలుండగా వాటిలో 3 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగే 49 సర్పంచ్‌ పదవులకు 132 మంది పోటీ పడుతున్నారు.  

మరిన్ని వార్తలు