తొలి విడత: 35 పంచాయతీలు.. 762 వార్డులు ఏకగ్రీవం 

5 Feb, 2021 11:00 IST|Sakshi

31 గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ అభిమానులు ఏకగ్రీవ ఎన్నిక 

టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి స్వగ్రామంలోనూ వైఎస్సార్‌ సీపీ అభిమానికి అవకాశం 

ఫ్యాక్షన్‌ గ్రామాల్లో సైతం పోటీలు లేకుండా శాంతి పవనాలు 

సాక్షి, ఒంగోలు:  పల్లె పోరులో రెండు కీలక ఘట్టాలు గురువారం ముగిశాయి. జిల్లాలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ, రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలు పూర్తయ్యాయి. మొదటి విడతలో 13 మండలాల పరిధిలోని 227 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాయి. ఇందులో 35 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, 762 వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధ్రువీకరించారు. గ్రామాల్లో ఎన్నికలు జరగడం కంటే ఏకగ్రీవాల వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి 35 గ్రామాల ప్రజలు శాంతి వైపు అడుగులు వేశారు. అభివృద్ధికి తోడ్పాటునందిస్తారనుకున్న వారిని సర్పంచ్‌గా తామే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు మిగల్చడంతో పాటు ఏకగ్రీవాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అందుకుని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలని నిశ్చయించుకున్నారు.  

ఇందులో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో 15 గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లు ఎన్నుకోగా, సంతనూతలపాడులో 13 గ్రామాల్లో, ఒంగోలులో 3 గ్రామాల్లో, టంగుటూరు మండలంలో 3 గ్రామాలతో పాటు వేటపాలెం మండలంలో ఎన్నిక జరుగుతున్న ఒక్క గ్రామంలో సైతం సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  
మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి 35 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 192 గ్రామాల్లో ఈ నెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం పోటీలో నిలిచిన అభ్యర్ధులకు గుర్తులను కేటాయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

మరోవైపు రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సైతం గురువారంతో ముగిసింది. చాలా గ్రామాల్లో ఈ దశలో సైతం ఏకగ్రీవాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక గ్రామాల్లో ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తేదీన జరిగే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో మరికొన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుని గ్రామాల్లో చిచ్చు రేపాలనే కుట్రను భగ్నం చేస్తూ అనేక గ్రామాల ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవాల వైపు అడుగులు వేయడం శుభపరిణామం. జిల్లాలో ఏకగ్రీవమైన 35 గ్రామ పంచాయతీల్లో 31 చోట్ల వైఎస్సార్‌ సీపీ అభిమానులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవం కాగా 4 చోట్ల మాత్రమే టీడీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

బద్దలైన టీడీపీ కంచు కోటలు..  
దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న అనేక గ్రామాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడంతో టీడీపీ కోటలు బద్దలయ్యాయి. గతంలో ఎన్నడూ ఏకగ్రీవం కాని అనేక గ్రామాలు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం చూస్తుంటే గ్రామాభివృద్ధి కంటే ఎన్నికలు ముఖ్యం కాదనే విషయం ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేసినట్లయింది. ముఖ్యంగా యద్దనపూడి మండలం దరిశి గ్రామం పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వగ్రామం. ఆయన కుటుంబ సభ్యులకు అక్కడే ఓటు ఉంది. అయినప్పటికీ అక్కడ వైఎస్సార్‌ సీపీ అభిమాని అయిన బీసీ మహిళను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  
నాడు తీవ్ర పోటీ.. నేడు ఏకగ్రీవాలు.. 
యద్దనపూడి మండలంలోని వింజనంపాడు గ్రామం సైతం టీడీపీకి కంచుకోటగా మొదటి నుంచి ఉండేది. అక్కడ సైతం వైఎస్సార్‌ సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్చూరు మండలం ఇనగల్లు గ్రామం ఫ్యాక్షన్‌తో రగిలిపోయేది. ఎన్నికలు వచ్చాయంటే గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి. ఎన్నికలు వస్తే ఎప్పుడు ఏమవుతుందోనని గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి. గ్రామం ఏర్పడి దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏకగ్రీవం అయిన పరిస్థి లేదు. అయితే తొలిసారిగా ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభిమాని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికవడం చెప్పుకోదగ్గ విషయం. 

పర్చూరు నియోజకవర్గంలోని ఏలూరివారిపాలెం, చినరావిపాడు, టంగుటూరు మండలం అనంతవరం, అల్లూరు, ఒంగోలు మండలం కరవది, వలేటివారిపాలెం, ఉలిచి, నాగులుప్పలపాడు మండలం కొత్తకోట గ్రామాలు సైతం దశాబ్దాలుగా ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంటూ వస్తోంది. వీటిలో అనేక గ్రామాల్లో టీడీపీ అభిమానులే సర్పంచ్‌లుగా గెలుస్తూ వస్తున్నారు. అయితే మొదటిసారి వైఎస్సార్‌ సీపీ అభిమానులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. చీరాల నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతున్న ఒకే ఒక్క గ్రామమైన వేటపాలెం మండలం రామన్నపేట గ్రామం గత 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఎన్నిసార్లు ఎన్నిక జరిగినా టీడీపీ అభిమానులే సర్పంచ్‌లుగా ఎన్నికవుతూ వచ్చారు. మొదటిసారిగా రామన్నపేట సర్పంచ్‌గా వైఎస్సార్‌ సీపీ అభిమాని ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంచలనం కలిగించింది. కారంచేడు మండలం యర్రంవారిపాలెం గ్రామ పంచాయతీగా ఏర్పడిన వద్ద నుంచి ఒక్కసారి కూడా ఎన్నిక జరగని పరిస్థితి. అక్కడ గ్రామ పెద్దలే ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుని గ్రామాభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఈ సారి కూడా అక్కడ  సర్పంచ్‌ అభ్యరి్థని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు