పులివెందుల ‘పంచ్‌’ అదిరింది

22 Feb, 2021 04:23 IST|Sakshi

సాక్షి, కడప: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అభిమానులకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అగ్రాసనం దక్కింది. ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్‌ స్థానాలను అధికార పార్టీ అభిమానులు దక్కించుకుని విజయకేతనం ఎగుర వేశారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సొంత పంచాయతీ కసనూరులో సైతం టీడీపీ మద్దతుదారుడు అధికార పార్టీ అభిమానికి పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పరాజయం పాలయ్యాడు.

నియోజకవర్గంలో ఎక్కడా ప్రతిపక్ష పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ పెట్టలేని పరిస్థితికి చేరుకుంది. పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. 5 మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులే విజయదుందుభి మోగించారు. కేవలం 8 గ్రామ పంచాయతీల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు పోటీలో నిలిచినా, ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. నంద్యాలంపల్లి, పైడిపాలెం, దుగ్గనగారిపల్లె పంచాయతీలలో మొత్తంగా కేవలం 6 వార్డులే ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు దక్కడం గమనార్హం. 

సంక్షేమ పథకాల ఫలితమిది..
రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సొంత నియోజకవర్గం పులివెందులలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతోపాటు రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీఎంతో చర్చించి అభివృద్ధి పనులకు నిధులు తెప్పించడంలో ముందుంటున్నారు. దీంతో స్థానిక ప్రజలు అధికార పార్టీకి బ్రహ్మరథం పట్టినట్లు స్పష్టమవుతోంది.

14 ఏళ్లు సీఎం.. 14 పంచాయతీలకు పరిమితం
సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో 100 శాతం పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పం నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉండగా 89 పంచాయతీలకు మూడవ విడతలో ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, టీడీపీ మద్దతుదారులు కేవలం 14 పంచాయతీల్లో గెలిచారు.

ఓట్ల పరంగా చూస్తే అధికార పార్టీ మద్దతుదారులకు ఏకంగా 31 వేల ఓట్లకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. కుప్పంలో అభివృద్ధి చేశానంటూ బూటకపు మాటలు చెప్పే చంద్రబాబుకు ఆ నియోజకవర్గ ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల కుప్పం ప్రజలు మొగ్గు చూపారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గంలో కేవలం 14 పంచాయతీలకు మాత్రమే పరిమితమయ్యారు. 

మరిన్ని వార్తలు