చంద్రబాబుకు భారీ షాక్‌: కుప్పంలో టీడీపీ ఢమాల్‌

18 Feb, 2021 03:53 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అభిమానుల విజయభేరి

89 పంచాయతీలకుగాను 74 చోట్ల గెలుపు

పలుచోట్ల టీడీపీ మద్దతుదారులకు డిపాజిట్లు గల్లంతు

సాక్షి, తిరుపతి/కుప్పం: కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయభేరి మోగించారు. టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. మూడో విడతలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీలకు పరిమితమయ్యారు. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కులమతాలు, పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన ప్రభావం కుప్పంలోనూ పడింది. ‘కుప్పం పేరు చెబితే టీడీపీ’ అన్న మాటకు బ్రేక్‌పడింది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించి చరిత్ర తిరగరాశారు. చాలా పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.  

పతనం దిశలో టీడీపీ 
కుప్పంలో టీడీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలు తార్కాణంగా నిలిచాయి. 1985 నుంచి టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడినుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1989లో చంద్రబాబు తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా కుప్పం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఏడు పర్యాయాలు ఇక్కడ గెలిచారు. మూడుసార్లు సీఎంగా పదవి చేపట్టారు. కుప్పంలో తనకు తిరుగులేదని ఇంతకాలం నిరూపించుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర తిరగబడింది. 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే 74 పంచాయతీలు వైఎస్సార్‌సీపీపరమయ్యాయి. గుడిపల్లె, అడవిబూదగూరు, ఊర్లోఓబనపల్లె లాంటి మేజర్‌ పంచాయితీలు సైతం వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరిపోయాయి. గుండ్లసాగరంలో టీడీపీ మద్దతుదారు 140 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దాసిమానుపల్లెలో కేవలం 98 ఓట్లే టీడీపీ మద్దతుదారుడికి దక్కాయి. 978 ఓట్లు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుకు లభించాయి. రామకుప్పం మండలం కెంచనబల్లలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సుబ్రమణ్యం 2003 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారునికి కేవలం 285 ఓట్లు వచ్చాయి. తన హయాంలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప నియోజకవర్గాన్ని నిర్దిష్టంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విఫలమవడం ఫలితంగానే ఈ దుస్థితి తలెత్తిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

కుప్పంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంబరాలు 
టీడీపీ కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఘన విజయం సాధించడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ శ్రేణులు, అభ్యర్థుల్లో ఆనందానికి అంతులేకుండా పోయింది. బాణసంచా పేలుళ్లు, పలక వాయిద్యాలు, బ్యాండు సన్నాయి, డ్యాన్సులతో సంబరాలు 
జరుపుకున్నారు. 

జగనన్న పథకాలే గెలిపించాయి
జగనన్న ప్రవేశపెట్టిన పథకాలే మా పంచాయతీ సర్పంచ్‌ను గెలిపించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇవ్వడం, అందులోనూ 1వ తేదీన సూర్యుడు ఉదయించకముందే ఇవ్వడం ప్రజల్లో మార్పును తీసుకొచ్చింది. పెన్షన్, రేషన్, ఆరోగ్య కార్డులు తీసుకునే సందర్భంలోనూ జనం జగనన్నను తలచుకుంటున్నారు.     – నరసింహులు, ఊరునాయునికొత్తూరు, కుప్పం మండలం

పథకాల పంపిణీలో పారదర్శకతే నన్ను గెలిపించింది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పథకాల పంపిణీలో చూపుతున్న పారదర్శకతే చందం సర్పంచ్‌గా నన్ను గెలిపించింది. గత 20 ఏళ్లుగా చందంలో టీడీపీ అభ్యర్థులే గెలుపొందుతున్నారు. అయితే మభ్యపెడుతూ ఎంతోకాలం మనుగడ సాధ్యం కాదు. టీడీపీ పతనానికి కారణమదే. – కుమారస్వామి, చందం సర్పంచ్‌ 

మరిన్ని వార్తలు