సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం

12 Dec, 2021 03:40 IST|Sakshi

బి.కొత్తకోట/బెంగళూరు/చిత్తూరు కలెక్టరేట్‌: తమిళనాడులోని కూనూరు వద్ద సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన లాన్స్‌నాయక్‌ బి.సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో శనివారం అందించారు. కలెక్టర్‌ హరినారాయణన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలిసి చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడవారిపల్లె వచ్చారు. సాయితేజ భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహనలను పరామర్శించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. లాన్స్‌నాయక్‌ సాయితేజ విధి నిర్వహణలో మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశానికి సాయితేజ చేసిన సేవ గొప్పదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. శ్యామల విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మదనపల్లెలో ఇంటిస్థలాన్ని కేటాయిస్తామన్నారు. పిల్లల చదువుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అనంతరం సాయితేజ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. 

నేడు ఎగువరేగడలో అంత్యక్రియలు 
కాగా, సాయితేజ భౌతికకాయం శనివారం బెంగళూరు చేరుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌కు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని తరలించగా.. అక్కడ ఆర్మీ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం వరకు సాయితేజ పార్థివదేహం బెంగళూరులోనే ఉండనుంది. అనంతరం బెంగళూరు నుంచి స్వగ్రామమైన ఎగువరేగడ గ్రామానికి పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడ సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్గం వెంబడి సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సరిహద్దున గల చీకలబైలు నుంచి అభిమానులు, ప్రజలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐలు సుకుమార్, రామమోహన్‌ పరిశీలించారు.

కడవరకు దేశ సేవలోనే ఉంటా: మహేష్‌బాబు  
తన అన్న సాయితేజ దేశ సేవలో తుది శ్వాస విడిచినా.. తాను దేశ సేవ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సాయితేజ సోదరుడు బి.మహేష్‌బాబు చెప్పారు. సిక్కింలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్‌బాబు కురబలకోట మండలం రేగడవారిపల్లెలో శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘డిసెంబర్‌ 8న మేం పనిచేస్తున్న రెజిమెంట్‌ ఏఎస్‌పీ క్రోర్‌ డే వేడుకలు జరుపుకుంటుండగా మధ్యాహ్నం సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైందనే సమాచారం వచ్చింది. ఆ వెంటనే వేడుకల్ని నిలిపివేశారు. టీవీల్లో చూస్తుండగా సాయితేజ కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తల్లో వచ్చింది.

సాయితేజ అంటే ఎంతోమంది ఉండవచ్చు, అన్నపేరు బి.సాయితేజ కదా అని సర్దిచెప్పుకొన్నా. తర్వాత వదిన శ్యామలకు ఫోన్‌చేసి అన్న ఎక్కడికైనా వెళ్తున్నట్టు చెప్పాడా అని అడిగితే.. లేదని సమాధానం వచ్చింది. అన్న మిత్రులైన జవాన్లకు ఫోన్‌చేస్తే సెలవుల్లో ఉన్నామన్నారు. అన్న మొబైల్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది. టెన్షన్‌ భరించలేకపోయా. చివరికి ఏదైతే జరగకూడదనుకున్నానో అదే నిజమైంది. ప్రమాదంలో మరణించిన సాయితేజ నా సోదరుడేనని తెలిసింది. మా అన్న దేశ సేవలోనే ప్రాణాలర్పించారు. అన్న మరణం తీరని లోటే అయినా, నేను జవానుగానే కొనసాగుతాను. తల్లిదండ్రుల బాధ్యతను కూడా నెరవేరుస్తా. సాయితేజ మృతి నాకే కాదు.. ఎందరో యువకులకు తీరని లోటు’ అన్నారు.  

మరిన్ని వార్తలు