శభాష్‌.. పోలీస్‌

18 Nov, 2021 04:44 IST|Sakshi

లైంగిక దాడులపై దర్యాప్తులో ఏపీకి మొదటి స్థానం

సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో ఏపీ పోలీసుల సామర్థ్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీస్‌ శాఖ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో చార్జిషీట్లు దాఖలు చేయడంలో మన రాష్ట్ర పోలీసులు అద్వితీయమైన పనితీరు కనబరిచారు. ఏకంగా 93.80 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేసి ఏపీ పోలీస్‌ శాఖ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

ప్రత్యేక ట్రాకింగ్‌ వ్యవస్థ
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషులను గుర్తించేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లతోపాటు వివిధ సంస్థల నుంచి రావల్సిన నివేదికలను సకాలంలో తెప్పించేందుకు అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. దర్యాప్తు అధికారిని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అప్రమత్తం చేస్తూ నిర్ణీత గడువులోగా కేసు దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు చార్జిషీట్‌ దాఖలు చేసేలా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తు ప్రగతిని వివిధ దశల్లో బాధితులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తోంది. 

పటిష్టంగా ఐసీజేఎస్‌ విధానం 
క్రిమినల్‌ జస్టిస్‌ విధానంలోని అన్ని ప్రధాన విభాగాలకు కేసుల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సమన్వయపరిచేందుకు ‘ఇంటర్‌ ఆపరేటబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం (ఐసీజేఎస్‌)ను పోలీసు శాఖ సమర్థంగా నిర్వహిస్తోంది. దాంతో దర్యాప్తును సకాలంలో పూర్తి చేసి ప్రాసిక్యూషన్‌ వేగవంతం చేయడం ద్వారా దోషులకు సత్వర శిక్షలు పడేలా చేస్తోంది. ఐసీజేఎస్‌ విధానం ద్వారా పౌరులకు సేవలందించడంలో గతంలో రెండోస్థానంలో ఉన్న రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇప్పుడు మొదటి స్థానానికి చేరింది. 

సీఎం, కేంద్ర హోం మంత్రి అభినందనలు
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సకాలంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల  భద్రతకు భరోసా ఇవ్వడంలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సైతం రాష్ట్ర పోలీస్‌ శాఖను అభినందించారు. కాగా, సమగ్ర దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందిస్తున్న పోలీసు టెక్నికల్‌ సర్వీసెస్‌ విభాగాన్ని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. డీఐజీ ( పోలీస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌) పాలరాజు, ఇతర సాంకేతిక అధికారుల బృందాన్ని ఆయన ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు