ఏపీ: 18వ రోజుకు కర్ఫ్యూ.. ఆంక్షలు మరింత కఠినతరం

22 May, 2021 09:49 IST|Sakshi

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆంక్షలు కఠినతరం

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం

మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలోకి నో ఎంట్రీ

ఈ-పాస్ ఉన్నవారికే అనుమతి

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ 18వ రోజుకు చేరుకుంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను పోలీసులు తూచా తప్పక ఆచరిస్తున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలోకి అనుమతించడం లేదు. ఈ పాస్ ఉన్న వారికే అనుమతి ఇస్తున్నారు. పెళ్లిళ్లు, శుభ,అశుభ కార్యాలకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు.

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిచిన వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వాహనాలు సీజ్ చేసి ,కేసులు నమోదు చేస్తున్నారు. మాస్క్‌లు లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. 11-30 గంటలకే స్వచ్చందంగా వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. మరో పది రోజులు ఇదే సహకారం అందించి కరోనా కట్టడికి సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు.


బాల కార్మికులు, వీధి బాలలపై ప్రత్యేక దృష్టి..
బాల కార్మికులు ,వీధి బాలాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. 8739 మందిని గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 28 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. 8724 మందిని తల్లితండ్రులకు అప్పగించారు. 15 మందిని ఛైల్డ్‌ కేర్‌ సెంటర్లకు తరలించారు.

చదవండి: Cyclone Yaas: యాస్‌ తుపాను.. పలు రైళ్ల రద్దు  
ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్‌

మరిన్ని వార్తలు