అరచేతిలో 87 రకాల సేవలు.. ఈ యాప్‌ మీ ఫోన్‌లో ఉంటే వెంట పోలీస్‌ ఉన్నట్టే!

5 Aug, 2022 08:00 IST|Sakshi

మొబైల్‌ నుంచే 87 రకాల సేవలు 

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. మన వెంట పోలీసు ఉన్నట్టే  

ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం

దొండపర్తి(విశాఖ దక్షిణ): ఈ యాప్‌ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి ప్రమాదం, సమస్య వచ్చినా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే క్షణాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అద్బుతమైన అవకాశం ఇందులో ఉంది. అదే ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌. అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్‌ రూపొందించారు. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. పోలీస్‌స్టేషన్‌ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. అందుకే మొబైల్‌లో ఈ యాప్‌ ఉంటే.. మన వెంట పోలీస్‌ ఉన్నట్టే!  

ఆరు విభాగాల్లో 87 రకాల పోలీస్‌ సేవలు 
పోలీస్‌ స్టేషన్లో ప్రజలకు అందే సేవలను ఆరు విభాగాలుగా విభజించారు. శాంతిభద్రతలు. ఎన్‌ఫోర్స్‌మెంట్, పబ్లిక్‌ సేవలు, రహదారి భద్రత, ప్రజా సమాచారం, పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ ఇలా ఆరు విభాగాల్లో పోలీస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.  

శాంతి భద్రతలు 
నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, దొంగతనాలపై ఫిర్యాదులు, రికవరీలు, తప్పిపోయిన కేసులు, దొరికిన వారు, గుర్తు తెలియని మృతదేహాలు, అరెస్ట్‌ వివరాలు, అపహరణకు గురైన వాహనాల వివరాలను పొందవచ్చు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 
ఇంటి పర్యవేక్షణ, ఈ–బీట్, ఈ–చలానా స్టేటస్‌లను తెలుసుకోవచ్చు. 

పబ్లిక్‌ సేవలు  
నేరాలపై ఫిర్యాదులు, సేవలకు సంబంధించిన దరఖాస్తులు, ఎన్‌వోసీలు, వెరిఫికేషన్లు, లైసెన్స్‌లు, అనుమతులు, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. 

రహదారి భద్రత  
బ్లాక్‌ స్పాట్లు, ప్రమాదాల మ్యాపింగ్, రోడ్డు భద్రతా గుర్తులు, బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆస్పత్రులు, మందుల దుకాణాల వివరాలను తెలుసుకోవచ్చు.  

ప్రజా సమాచారం  
పోలీస్‌ డిక్షనరీ, సమీప పోలీస్‌ స్టేషన్ల వివరాలు, టోల్‌ ఫ్రీ నంబర్లు, వెబ్‌సైట్ల వివరాలు, న్యాయ సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. 

పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ 
సైబర్‌ భద్రత, సోషల్‌ మీడియా, కమ్యూనిటీ పోలీసింగ్, స్పందన వెబ్‌సైట్, ఫ్యాక్ట్‌ చెక్‌ సేవలు, తదితరవన్నీ పొందుపర్చారు. 

ఎక్కడ ఉన్నా.. ఫిర్యాదు చేసుకోవచ్చు.. 
పోలీస్‌ సేవ యాప్‌ ద్వారా ఉన్న చోట నుంచే వేధింపులు, నేరాలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు, పోలీస్‌ సేవల్లో లోపాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఐడీ నంబర్‌తో సహా ఫిర్యాదుదారుడి మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. అలాగే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్ని కూడా మెసేజ్‌లో తెలియజేస్తారు. పిటిషన్‌ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసలుబాటును కలి్పంచారు. 

ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ నమోదు నుంచీ.. 
ఏదైనా కేసుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటి నుంచి నిందితులను కోర్టులో హాజరుపరచడం విచారణ, సాక్షులు, కేసులో ట్రయల్స్, ఇలా మొత్తం 24 దశల్లో కేసు సమగ్ర సమాచారం మెసేజ్‌ రూపంలో తెలుస్తుంటాయి. ఎఫ్‌ఐఆర్‌ కోసం స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. యాప్‌ ద్వారా సులభంగా ఎఫ్‌ఐఆర్‌ను డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.  

ఈ–చలానా  
వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న చలానాలను పరిశీలించి చెల్లించవచ్చు. 

మహిళ భద్రతకు ప్రాధాన్యం  
పోలీస్‌ సేవ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. సేఫ్టీ సేవ ద్వారా 12 రకాల సేవలను అందుబాటులో ఉంచారు. దిశ, సైబర్‌ మిత్ర యాప్, వన్‌ స్టాప్‌ సెంటర్, ఏపీ స్టేట్‌ ఉమెన్‌ కమిషన్, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ తదితర 12 మాడ్యూళ్లను అనుసంధానం చేశారు. ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. 

ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం 
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘పోలీస్‌ సేవ’యాప్‌ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో సైబర్‌ నేరాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదులపై తక్షణం స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ‘పోలీస్‌ సేవ’ను సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దిశ యాప్‌ను తప్పకుండా మొబైల్‌లో డౌన్లోడ్‌ చేసుకోవాలి. తద్వారా క్షణాల్లో పోలీసు సాయం పొందుతారు. 
– సి.హెచ్‌.శ్రీకాంత్, నగర పోలీస్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు