పోలీసుల ఆత్మస్థైర్యాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారు

7 Oct, 2020 04:45 IST|Sakshi

ఏపీ పోలీస్‌ టెక్నికల్‌ చీఫ్‌ పాల్‌రాజ్‌ 

వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు

సాక్షి, అమరావతి: వాస్తవాలు నిర్ధారించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ పోలీస్‌ శాఖ టెక్నికల్‌ చీఫ్, డీఐజీ పాల్‌రాజ్‌ పేర్కొన్నారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో పాల్‌రాజ్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వాస్తవాలు నిర్ధారించుకోకుండా పోలీసు శాఖపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు రాసిన రెండోసారి రాసిన లేఖలోనూ చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేశారు. పాల్‌రాజ్‌ ఇంకా ఏమన్నారంటే..

► దేశంలో పోలీసు సిబ్బందిపై నమోదైన కేసుల్లో 41% ఏపీలోనే ఉన్నట్టు లేఖలో పేర్కొనడం విజ్ఞతకాదు. చిత్తూరు, విశాఖ సిటీ, విశాఖ రూరల్‌లో కేసుల డేటా తప్పుగా నమోదు కావడం వల్లే ఎన్‌సీఆర్‌బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో) లెక్కల్లో తేడాలున్నాయనే విషయాన్ని నిర్ధారించుకోకపోవడం దారుణం. 
► షేక్‌ సత్తార్, ఆయన కుటుంబ సభ్యులు బాధితులుగా ఉన్న నాలుగు కేసుల్లో పోలీసులు తీసుకున్న చర్యలను విస్మరించడం దురదృష్టకరం. 
► టీడీపీ నాయకుడు పట్టాభి కారు ధ్వంసం చేసినట్టు ఫిర్యాదు చేసిన వెంటనే విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. పట్టాభి ఇంట్లో సీసీ కెమెరాలు సంఘటనకు ముందు నుంచి మాత్రమే పనిచేయకపోవడం దురదృష్టకరం. 
► డీజీపీ సవాంగ్‌ దేవాలయాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడితే దాన్ని తప్పుదోవ పట్టించే చంద్రబాబు, పట్టాభి... మతకల్లోల డాటాను ప్రస్తావించడం ఎంతవరకు సబబు? 
► గతేడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 3 శిరోముండనం కేసుల్లో... సీతానగరంలో నిందితుడు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయడమే కాకుండా అరెస్టు చేసి జైలుకు తరలించారు. విశాఖ కేసులో ఏడుగురు నిందితులను, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
► ఆలయాల వద్ద 5,400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. దేవాలయాల్లో నేరాలకు పాల్పడిన 1,093 మందిని బైండోవర్‌ చేశాం. ఇప్పటివరకు 29 కేసుల్లో 22 కేసులను ఛేదించడంతో పాటు 178 మంది నిందితులను అరెస్ట్‌ చేశాం.
► నిరసన గళాలను తొక్కి వేస్తున్నామనడం సత్యదూరం. పోలీసు శాఖ దిశ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, దిశ యాప్‌తో సమర్థవంతమైన సేవలు అందిస్తోంది. ఇటువంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపక్ష నేత పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా విమర్శలు చేయడం సరికాదు. ఇలాంటి చర్యలు మానుకోవాలి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు