అమర రాజా బ్యాటరీస్‌ మూసివేతకు ఆదేశం

2 May, 2021 03:27 IST|Sakshi

అమర రాజా బ్యాటరీస్‌ మూసివేతకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశం

చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడి వద్ద నిర్వహిస్తున్న రెండు పరిశ్రమల మూసివేతకు ఉత్తర్వులు

ఆ పరిశ్రమల వ్యర్థాల వల్ల గాలి, నీరు, మట్టి కలుషితమవుతున్నట్టు గుర్తింపు

పరిశ్రమల్లోని ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజల రక్తంలోనూ మోతాదుకు మించి సీసం నిల్వలు

ఇటీవల ఇదే తరహాలో జువారి సిమెంట్స్‌పై కొరడా

గత నెల 24న మూసివేతకు ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: కాలుష్య కాసారాలుగా మారుతున్న పరిశ్రమలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ  (ఏపీ పీసీబీ) మండలి కొరడా ఝళిపిస్తోంది. వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్లపల్లి మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న జువారి సిమెంట్‌ పరిశ్రమ మూసివేతకు గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి.. తాజాగా అమర రాజా బ్యాటరీస్‌కు చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చింది. అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమల్లో లోపాలను సరిదిద్దుకోవాలంటూ షోకాజ్‌ నోటీసులు 
జారీ చేసినా ఆ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దాంతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న రెండు పరిశ్రమలనూ మూసివేయాలంటూ ఏపీ పీసీబీ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తనిఖీల్లో వెల్లడైన లోపాలను సరిదిద్దుకుని కాలుష్య ఉద్గారాలకు యాజమాన్యాలు అడ్డుకట్ట వేయగలిగేలా చర్యలు తీసుకుంటే ఈ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తారు. 

గాలి, నేల, నీరు కాలుష్యమే..
అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమల్లో ఫిబ్రవరి 25, 26, మార్చి 8, 9, 25, 26 తేదీల్లో ఏపీ పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతి జారీ చేసినప్పుడు పేర్కొన్న ప్రమాణాలతో పోలిస్తే వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు తేలింది. క్యూబిక్‌ మీటర్‌ వాయువు(గాలి)కి నిబంధనల మేరకు లెడ్‌ (సీసం) 1 మైక్రో గ్రాము ఉండాలి. కానీ.. ట్యాబులర్‌ బ్యాటరీస్‌ ఉత్పత్తి చేసే విభాగంలో 1.151, ఆటోమొబైల్‌ బ్యాటరీస్‌ విభాగంలో 22.2 మైక్రో గ్రాములు ఉన్నట్టు తేలడంతో పర్యావరణ అనుమతిలో పేర్కొన్న నిబంధనలను అమర రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ ఉల్లంఘించినట్టు ఏపీ పీసీబీ అధికారులు తేల్చారు. పరిశ్రమ అవసరాల కోసం రోజూ వినియోగించే నీటి ద్వారా వచ్చే 2,186 కిలో లీటర్ల వ్యర్థ జలాలను సక్రమంగా శుద్ధి చేయకుండానే గ్రీన్‌ బెల్ట్‌లో పెంచుతున్న మొక్కలకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. గ్రీన్‌ బెల్ట్‌లోని పలుచోట్ల మార్చి 9న మట్టి నమానాలను సేకరించిన ఏపీ పీసీబీ అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక కిలో మట్టిలో కనిష్టంగా 49.2 నుంచి గరిష్టంగా 177.5 మిల్లీగ్రాముల సీసం ఉండాలి. కానీ 295.5 మిల్లీ గ్రాముల సీసీం ఉన్నట్టు తేలింది.

ఉద్యోగులు, ప్రజల రక్తంలోనూ సీసం
పరిశ్రమలో పనిచేసే 3,533 మంది ఉద్యోగుల రక్త నమూనాలను సేకరించిన తనిఖీ బృందం వాటిని పరీక్షించింది. రక్త నమూనాల్లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు వెల్లడైంది. పరిశ్రమ పరిసర గ్రామాల్లోని ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాల్లోనూ సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు రూఢీ అయింది.  దీంతో ఏప్రిల్‌ 6న అమర రాజా బ్యాటరీస్‌ సంస్థకు ఏపీ పీసీబీ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా.. ఏప్రిల్‌ 20న అమర రాజా సంస్థ సమాధానం ఇచ్చింది. దీనిపై ఏప్రిల్‌ 22న ఎక్సటర్నల్‌ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) సమావేశమై సమగ్రంగా చర్చించింది. పర్యావరణ అనుమతిని ఉల్లంఘించిన అమర రాజా బ్యాటరీస్‌ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ పీసీబీకి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నూనెగుండ్లపల్లి, కరకంబాడి వద్ద గల రెండు పరిశ్రమలనూ మూసివేయాలని పేర్కొంటూ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది.

పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: అమరరాజా
‘ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని చర్యలూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సైన్యం, ఆస్పత్రులు, టెలికాం రంగాలకు బ్యాటరీల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కంపెనీ ముందు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. కోవిడ్‌ విపత్తు వేళ సున్నిత రంగాలకు సరఫరా దెబ్బతినకుండా అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు అమర రాజా సుదీర్ఘకాలంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు అవార్డులను కూడా సాధించింది. మేం తీసుకుంటున్న అన్ని చర్యల్ని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు వివరించాం’ అని అమర రాజా సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు