పాలిసెట్‌లో సత్తా చాటారు

19 Jun, 2022 23:14 IST|Sakshi
తల్లిదండ్రులతో నాగమానస   

పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల  

90.97 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా విద్యార్థులు  

జిల్లాలో మొదటి, రాష్ట్రంలో 54వ ర్యాంకు సాధించిన నాగమానస 

కడప ఎడ్యుకేషన్‌: పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. జిల్లా వ్యాప్తంగా మే నెల 29వ తేదీన కడప, ప్రొద్దుటూరులలో కలుపుకుని 23 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు 7843 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 7119 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 90.97 ఉత్తీర్ణత శాతం సాధించారు. వీరిలో 4811 మంది బాలురకు 4312 మంది ఉత్తీర్ణులై 86.63 శాతం, 3032 మంది బాలికలకు 2807 మంది ఉత్తీర్ణులై 92.58 శాతం ఉత్తీర్ణత సాధించారు.  

జిల్లా ఫస్ట్‌ నాగమానస  
పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలో మైదుకూరుకు చెందిన రాచమల్లు నాగమానసరెడ్డి 120 మార్కులకు 115 మార్కులు సాధించి రాష్ట్రంలో 54వ ర్యాంకు సాధించడంతోపాటు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే దువ్వూరు మండలం మీర్జన్‌పల్లెకు చెందిన ఇట్టా వెంకటలక్ష్మి 110 మార్కులను సాధించి రాష్ట్రంలో 206వ ర్యాంకును పొంది జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. తొండూరు మండలం ఊడవగాండ్లపల్లెకు చెందిన దాసరి నందిని 106 మార్కులతో రాష్ట్రంలో 390 ర్యాంకును సాధించి జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచింది.  

ఐఐటీ చదివి సివిల్స్‌ సాధించడమే లక్ష్యం  
బాగా చదివి ఐఐటీలో సీటు సాధించి ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తరువాత సివిల్స్‌లో ర్యాంకు పొంది కలెక్టర్‌ కావడమే లక్ష్యమని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన రాచమల్లు నాగమానసరెడ్డి తెలిపింది. నాగమానస తండ్రి నాగ వెంకటప్రసాద్‌రెడ్డి చాపాడు మండలం అన్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి లక్ష్మిదేవి గృహిణి. వీరిది మైదుకూరు పట్టణం. నాగమానస మైదుకూరులోని ఓ ప్రైవేటు హైస్కూల్లో పదవ తరగతి చదివి 563 మార్కులను సాధించింది.

మరిన్ని వార్తలు