వృద్ధులు తక్కువగా ఉన్న రాష్రాలేవో తెలుసా?

8 Aug, 2021 07:35 IST|Sakshi

ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 60 ఏళ్లు దాటిన వారు 12.4 శాతం

2011లో వృద్ధుల జనాభా 10.1 శాతమే

ప్రస్తుతం వృద్ధుల సంఖ్య 65,57,000

2031 నాటికి 88,63,000 మందితో 16.4 శాతానికి చేరుకుంటారని అంచనా

దేశ జనాభాలోనూ ఇదే పరిస్థితి

వృద్ధుల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ

కేంద్ర ప్రభుత్వ ఎల్డర్లీ ఇండియా 2020–21 నివేదిక వెల్లడి

60 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య దేశంలో భారీగా పెరుగుతోంది. 1961 నుంచి ఇందుకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే వీరి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2011 నుంచి పరిశీలిస్తే రాష్ట్రంలోనూ వీరి జనాభా పెరుగుతూ వస్తోంది. అప్పటి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వృద్ధుల శాతం 10.1 శాతం ఉంటే 2021కి అది 12.4 శాతానికి పెరిగింది. అదే 2031 నాటికి 16.4 శాతానికి పెరుగుతుందని అంచనా. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆర్థిక పరిపుష్టి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ.. వైద్య సౌకర్యాలేనని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎల్డరీ ఇండియా–2021 నివేదిక స్పష్టంచేసింది.

తమిళనాడులో అధికంగా..
ప్రస్తుతం దేశ్యాప్తంగా వృద్ధులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు (13.6 శాతం), హిమాచల్‌ప్రదేశ్‌ (13.1 శాతం), పంజాబ్‌ (12.6 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (12.4 శాతం) అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే, వృద్ధులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్‌ (7.7 శాతం), ఉత్తరప్రదేశ్‌ (8.1 శాతం), అస్సాం (8.2 శాతం) ఉన్నాయి. ఇక 2031 నాటికి కేరళలో 20.9 శాతానికి, తమిళనాడులో 18.2 శాతానికి, హిమాచల్‌ప్రదేశ్‌లో 17.1 శాతానికి, ఆంధ్రప్రదేశ్‌లో 16.4 శాతానికి, పంజాబ్‌లో 16.2 శాతానికి వీరు పెరుగుతారని అంచనా. 

పిల్లల సంఖ్య తగ్గుతోంది
ఇక జనాభా లెక్కలను పరిశీలిస్తే దేశంలో 0–14 ఏళ్ల వయస్సుగల పిల్లల సంఖ్య 1971 వరకు పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇందుకు సంతోనోత్పత్తి రేటు తగ్గడమేనని తేలింది. మరోవైపు.. వ్యక్తి ఆరోగ్య సౌకర్యాల లభ్యత, పోషక స్థాయి పెరగడంతో పాటు మెడికల్‌ సైన్స్‌ టెక్నాలజీలో వేగవంతమైన పురోగతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు అనేక వ్యాధులను నియంత్రించడం తేలికైంది. దీంతో వృద్ధుల మరణాలు తగ్గి వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఫలితంగా అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ మనిషి ఆయుర్ధాయం పెరుగుతూ వస్తోంది.

దేశంలో 1970–75 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్ధాయం సరాసరిన 48 ఏళ్లుండగా.. 2014–18కు వచ్చేసరికి అది 68 సంవత్సరాలకు పెరిగింది. అదే సమయంలో పట్టణాల్లో ఆయుర్ధాయం వయస్సు 58.9 ఏళ్ల నుంచి 72.6 సంవత్సరాలకు పెరిగింది. దేశం మొత్తం మీద 2011 నుంచి చూస్తే 0–14 సంవత్సరాల వయస్సు గల జనాభా తగ్గుతూ వస్తుండగా 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాక.. దేశంలోను, రాష్ట్రంలోను 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో మహిళలే అత్యధికంగా ఉండటం గమనార్హం. 2011 జనాభా లెక్కల నుంచి 2021, 2031 అంచనాల్లోనూ అటు దేశం ఇటు రాష్ట్రంలోనూ వృద్ధుల్లో మహిళల సంఖ్యే అధికం.

మరిన్ని వార్తలు