Cyclone Jawad: ‘జవాద్‌’ను ఎదుర్కొనేందుకు విద్యుత్‌ శాఖ సన్నద్ధం

4 Dec, 2021 08:12 IST|Sakshi

ఈపీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాలకు నోడల్‌ ఆఫీసర్లు 

ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు 

3,983 మంది సిబ్బందితో 298 బృందాలు రెడీ 

ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల తరలింపు

సాక్షి, అమరావతి:  జవాద్‌ తుపాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి విద్యుత్‌ శాఖ సన్నద్ధమైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఐదు జిల్లాల్లో సముద్ర తీరం వెంబడి గల 43 మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందన్న సమాచారం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని 15,35,683 (ఎల్‌టీ, హెచ్‌టీ) సర్వీసులకు విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ అధికారులను ఆదేశించారు.

చదవండి: Cyclone Jawad: దూసుకొస్తున్న ‘జవాద్‌’.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం 

తుపాను ప్రభావిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సామాగ్రి, అధికారులు, సిబ్బందిని  తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా 30 వైర్‌లెస్‌ సెట్లను ఇప్పటికే తెప్పించగా, మరో 20 సెట్లను ఏలూరు, రాజమహేంద్రవరం సర్కిల్స్‌ నుంచి అవసరాన్ని బట్టి తెచ్చుకునేందుకు సిద్ధం చేశారు. ప్రైవేటు క్రేన్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 42,189 డి్రస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వీటిలో ఏవైనా దెబ్బతింటే.. వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు సిద్ధం చేశారు. హాస్పటళ్లు, వాటర్‌ వర్క్స్, కలెక్టరేట్లు, రెవెన్యూ కార్యాలయాలకు ముందస్తుగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రత్యేక బృందాలు సిద్ధం 
శ్రీకాకుళం జిల్లాలో 1,300 మందితో 108 బృందాలు, విజయనగరం జిల్లాలో 708 మందితో 30 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 810 మందితో 72 బృందాలు, తూర్పు గోదావరి జిల్లాలో 765 మందితో 53 బృందాలు, పశి్చమ గోదావరి జిల్లాలో 400 మందితో 35 బృందాలను ఏపీఈపీడీసీఎల్‌ సిద్ధంగా ఉంచింది. కార్పొరేట్, సర్కిల్, డివిజన్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో 24 గంటలూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ మొత్తం ఆపరేషన్స్‌  పర్యవేక్షణకు నోడల్‌ ఆఫీసరనూ నియమించింది.  అత్యవసర సమయంలో  టోల్‌ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని డిస్కం సీఎండీ  సంతోషరావు విజ్ఞప్తి చేశారు.     

మరిన్ని వార్తలు