వరదల్లోనూ.. వెలుగుల కోసం.!

19 Jul, 2022 08:07 IST|Sakshi

ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విద్యుత్‌ సిబ్బంది 

రేయింబవళ్లు శ్రమిస్తున్న 65 బృందాలుగా.. 850 మంది.. 

ఐదు జిల్లాల్లో 70,148 సర్వీసులపై వర్షాల ప్రభావం 

ప్రతి డివిజన్‌లో 24గంటలూ పనిచేస్తున్న కంట్రోల్‌ రూములు 

అత్యవసర విభాగాలు, పాఠశాలలకు జనరేటర్ల ద్వారా విద్యుత్‌  

సాక్షి, అమరావతి: కరెంటు తీగ నీటిలో పడిందంటే..అటువైపు వెళితే షాక్‌ కొడుతుందని భయడుతుంటాం..అలాంటిది కిలోమీటర్ల కొలదీ హై టెన్షన్, లో టెన్షన్‌ అనే తేడా లేకుండా విద్యుత్‌ తీగలు తెగిపోయి వరదనీటిలో వేలాడుతుంటే..వాటిని సరిచేయడానికి చేసే ప్రయత్నం ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో పడవలపై వెళ్లి  లైన్లను సరిచేసేందుకు  వందలాది మంది విద్యుత్‌ శాఖ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో చీకటి అలుముకున్న గ్రామాల్లో వెలుగులు నింపేందుకు ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు పనిచేస్తున్నారు. 

భారీ దెబ్బ.. 
గోదావరి వరదల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీ ఎల్‌) పరిధిలోని అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా 12 మండలాల్లోని 406 గ్రామాల్లో 70,148 సర్వీసులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 8 సబ్‌స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 46 దెబ్బతిన్నాయి. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (టీడీఆర్‌) 3,964 పాడయ్యాయి. వీటిలో 3 సబ్‌ స్టేషన్లు, 33కేవీ ఫీడర్లు 3, 11కేవీ ఫీడర్లు 4, టీడీఆర్‌లు 383 బాగుచేశారు. వ్యవసాయ బోర్లు పూర్తిగా నీటమునగడంతో 5,368 సర్వీసులకు విద్యుత్‌ అందించలేని పరిస్థితి ఏర్పడింది. మిగతా వాటిలో 10,073 సర్వీసులకు అందిస్తున్నారు. 230 ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు, సెల్‌ టవర్లకు ఇంకా విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంది. 

నిరంతర ప్రయత్నం.. 
అత్యవసర సర్వీసులకు, వరద బాధితులు  పునరావాస కేంద్రాలకు, పలు వసతి గృహాలు, పాఠశాలలకు తాత్కాలిక విద్యుత్‌ లైన్లు, పవర్‌ జనరేటర్ల ద్వారా విద్యుత్‌ అందిస్తున్నారు. ఇక దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేశారు. అవసరమైన కండక్టర్లు, కేబు    ళ్లతో సహా 17,280 స్తంభాలను అందుబాటులో ఉంచారు. ప్రతి డివిజన్‌లోనూ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో జూనియర్‌ లైన్‌మెన్‌ దగ్గర్నుంచి డిస్కం సీఎండీ వరకూ 850 మంది సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. 

స్వయంగా పర్యవేక్షిస్తున్నాం
వరదల వల్ల విద్యుత్‌ వైర్లు నీటిలో మునిగిపోయాయి. వెంటనే వాటిని సరిచేయాలి. లేదా విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి. అలా నిలిపివేయాలన్నా కూడా ఆ ప్రాంతానికి వరద నీటిలోనే వెళ్లాలి. అది చాలా ప్రమాదకరం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎవరూ ప్రాణాలతో మిగలరు. అయినప్పటికీ వెళుతున్నాం.  నాతో పాటు కొందరు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయికి పడవలపై వెళ్లి విద్యుత్‌ పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే విద్యుత్‌ సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాం. 
– కే సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్‌

ఇదీ చదవండి: CM YS Jagan: 48 గంటల్లో సాయం

మరిన్ని వార్తలు