ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి

15 May, 2021 03:00 IST|Sakshi

రాష్ట్రంలో వివిధ ఆస్పత్రులకు విస్తృతంగా ఆక్సిజన్‌ 

సీఎం చర్యలతో ఆక్సిజన్‌ సరఫరా వేగవంతం

కొత్తగా 3 ఐఎస్‌వో ట్యాంకులు, మొత్తంగా 6 ట్యాంకులు

జామ్‌నగర్‌ నుంచి 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ 

పర్యవేక్షణ అధికారి కృష్ణబాబు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ఉధృతి నేపథ్యంలో ఒకేసారి పెరిగిన డిమాండ్‌కు తగినంతగా ఆక్సిజన్‌ సేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయ పురోగతి సాధించిందని ఆక్సిజన్‌ సేకరణ, సరఫరాను పర్యవేక్షణ చేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి టి.కృష్ణబాబు తెలిపారు. ఆక్సిజన్‌పై ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖతో సానుకూల పరిస్థితి వచ్చిందన్నారు.

కేంద్రం.. రాష్ట్రానికి కొత్తగా మరో మూడు ఐఎస్‌వో ట్యాంకులను ఇవ్వనుందని తెలిపారు. ఈ ట్యాంకులను శనివారం మధ్యాహ్నం దుర్గాపూర్‌లో అప్పగించనుందన్నారు. ఆదివారం నాటికి కృష్ణపట్నంకు 60 టన్నుల ఆక్సిజన్‌తో ప్రత్యేక రైలు చేరుకోనుందని పేర్కొన్నారు. ఇప్పటికే దుర్గాపూర్‌ స్టీల్‌ ఫ్యాక్టరీలో 2 కొత్త ట్యాంకుల్లో ఆక్సిజన్‌ను అధికారులు నింపారని, ఒక్కో ట్యాంకులో 20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్, మొత్తంగా 40 మెట్రిక్‌ టన్నులు వస్తుందన్నారు.

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా శనివారం నెల్లూరులోని కృష్ణపట్నంకు ఆక్సిజన్‌ ట్యాంకులు చేరుకుంటాయని, మొత్తంగా రాష్ట్రానికి 6 ఐఎస్‌ఓ ట్యాంకుల ద్వారా ఆక్సిజన్‌ రానుందని ఆయన తెలిపారు. ఒక్కో ప్రత్యేక రైలు ద్వారా మూడు ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్‌ సరఫరాకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఒక్కో ట్రిప్పులో 60 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైలు తీసుకురానుందని తెలిపారు. ఒడిశాలో వివిధ కర్మాగారాల నుంచి ఈ ఆక్సిజన్‌ను సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులకు రిజర్వ్‌లో ఆక్సిజన్‌ నిల్వలు ఉంచగలగుతామన్నారు. మరోవైపు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ ఫ్యాక్టరీ నుంచి మరో 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ శనివారం రైలు ద్వారా గుంటూరు చేరుకోనుందని తెలిపారు.   

మరిన్ని వార్తలు