ఎన్‌డీబీ టెండర్లు రద్దు

20 Sep, 2020 03:28 IST|Sakshi

ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే నిర్ణయం

వారం రోజుల్లో మళ్లీ పిలుస్తాం

మరికొన్ని సంస్థలు పాల్గొనేలా చర్యలు

మీడియా సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు

సాక్షి, అమరావతి: టెండర్లలో పోటీతత్వం పెంపొందించేందుకే న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను రద్దుచేశామని రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు స్పష్టంచేశారు. రీ టెండర్లలో వాస్తవాలు తెలుస్తాయని, పచ్చ పత్రికలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, వారికి నమ్మకం కలిగించేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లను రద్దుచేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం ఆయన ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్‌ ప్రాజెక్టు ఫేజ్‌–1లో టెండర్లు పిలిచామని.. 26 పనులు, 13 ప్యాకేజీలకు 25 టెండర్‌ బిడ్లు మాత్రమే వచ్చాయన్నారు.

పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్లు చేసిన విషయం రీ టెండర్లలో బహిర్గతం అవుతుందన్నారు. పారదర్శకంగా పనిచేయడమే కాదు.. పారదర్శకత ప్రతిబింబించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని.. టెండర్ల స్పందనపై ఆయన సమగ్రంగా సమీక్ష చేశారని కృష్ణబాబు వివరించారు. అధిక మొత్తం విలువగల టెండర్లలో తక్కువ మంది పాల్గొనడం సహజమేనని ఎన్‌డీబీ పేర్కొన్నా.. పారదర్శకత, నిష్పాక్షికతకు పెద్దపీట వేసేందుకే ప్రస్తుత టెండర్లను రద్దుచేసి మళ్లీ టెండర్లకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లను పూర్తిచేయాలని ఎన్‌డీబీ కోరిందని, అయితే.. తాను కేంద్రంతో మాట్లాడి గడువు కోరతానని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కృష్ణబాబు ఇంకా ఏమన్నారంటే..

– అర్హత విషయంలో చాలా కంపెనీలున్నా, 14 కంపెనీలే టెండరు వేయడానికి గల కారణాలు తెలుసుకుంటాం. 
– ఏపీ ప్రభుత్వం, ఎన్‌డీబీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు లోబడి ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం పనులను నిర్వహిస్తాం.
– ఎక్కువమంది టెండరులో పాల్గొనేలా చేస్తే, రాష్ట్రంలో మరింత ఎక్కువ కిలోమీటర్లు అభివృద్ధి చేసే అవకాశముంది.
– జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్, రివర్స్‌ బిడ్డింగ్‌ కూడా పారదర్శకత కోసమే. 
– కాంట్రాక్టర్లకు బ్యాంకులలో లిక్విడిటీ, కోవిడ్‌ కారణంగా లేబర్‌ అందుబాటు ఇబ్బందులు ఉండచ్చు. విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదు. ముందుగా 15 శాతం అడ్వాన్స్‌లు విడుదల చేస్తారు. 
– ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం టెండరు విలువ ఎంత ఉంటుందో.. కాంట్రాక్టు కంపెనీ టర్నోవర్‌ అంత ఉండాలి. 
– రాష్ట్రంలో అర్హత కలిగిన కాంట్రాక్టర్లతో సంప్రదించమని ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశాం. కాంట్రాక్టర్లు బ్యాంకు గ్యారంటీ, జీపీఏ మాత్రమే హార్డ్‌ కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. 
– ఏ రకమైన సమస్య ఉన్నా కాంట్రాక్టు ఏజెన్సీలు నేరుగా సూపరింటెండెంట్‌/చీఫ్‌ ఇంజనీర్లను సంప్రదించవచ్చు. 
– జరిగిన టెండర్లపై ఒక్క ఫిర్యాదు లేదా అభ్యంతరం రాలేదు. 
– టెండరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 
– ప్రాజెక్టు టెండర్లను భౌతికంగా అడ్డుకుంటే చర్యలు తీసుకుంటాం. 
– టెండర్ల పూర్తికి 45 రోజుల గడువు ఇస్తామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ అదనపు కార్యదర్శి చెప్పారు. 
– మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. 
– కొన్ని వార్తాపత్రికలు, పనికట్టుకుని నిరాధారమైన వార్తలు ప్రచురించడం, ప్రజల్లో లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా దురుద్దేశ్యపూర్వక రాతలు రాశాయి. వాటిని నివృత్తి చేస్తూ టెండరుదారుల్లో ఎలాంటి అనుమానాలు, అపోహలు కలగకుండా ఈ టెండర్లు రద్దుచేశాం. 
– ఎక్కువ మంది టెండర్లలో పాల్గొంటే ఖర్చు తగ్గడంతో పాటు నాణ్యత పెరుగుతుంది. 
– నిధులు మిగలడంవల్ల మరిన్ని పనులు చేపట్టే వీలు కలుగుతుందన్న అభిప్రాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తంచేశారు.

మరిన్ని వార్తలు