కొత్త ప్రాజెక్టుల ఆకర్షణలో ఏపీకి రెండో స్థానం

14 Jan, 2021 03:37 IST|Sakshi

మూడో త్రైమాసికంలో రూ.29,784 కోట్ల కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు

అత్యధికంగా సాగు, ఫార్మా, ఎలక్ట్రానిక్‌ రంగాల నుంచే.. 

ప్రాజెక్ట్స్‌ టుడే నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో రాష్ట్రంలో కొత్తగా రూ.29,784 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి 108 ప్రతిపాదనలను వచ్చినట్లు ప్రాజెక్ట్స్‌ టుడే తాజా నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా రూ.2,76,483 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రకటన వెలువడితే అందులో 10.77 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచినట్లు ప్రాజెక్ట్స్‌ టుడే పేర్కొంది. మొత్తం రూ.54,714 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ప్రాజెక్ట్స్‌ టుడే సంస్థ దేశంలో కొత్తగా ప్రకటించిన పెట్టుబడులు, పిలిచిన టెండర్లు ఆధారంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నివేదికను రూపొందిస్తుంది.

అందులో భాగంగా ప్రకటించిన తాజా సర్వేలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ప్రాజెక్టుల విలువలో మూడో వంతు కేవలం సాగు నీటి రంగానికి చెందిన అయిదు ప్రాజెక్టులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా సాగు నీటి రంగంలో పెట్టుబడులు తగ్గగా, కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.10,044.5 కోట్ల విలువైన మూడు భారీ ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత రాయితీలు (పీఎల్‌ఐ) స్కీం కింద ఫార్మా రంగంలో ఈ మూడు నెలల కాలంలో రూ.11,527.21 కోట్ల విలువైన 196 పెట్టుబడుల ప్రకటనలు వెలువడగా అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవి ఉన్నట్లుగా నివేదిక వివరించింది. కైనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ రూ.1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ గోల్ఫ్‌ కార్ట్‌తో పాటు లోయర్‌ సీలేరులో రూ.1,098.12 కోట్లతో ఏరా>్పటు చేస్తున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులు ముఖ్యమైన ప్రాజెక్టులుగా పేర్కొంది.

పెరిగిన ప్రైవేట్‌ పెట్టుబడులు
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుతూ, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నట్లు ప్రాజెక్ట్స్‌ టుడే స్పష్టం చేసింది. ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే మొత్తం పెట్టుబడుల ప్రతిపాదనల్లో ప్రైవేటు సంస్థల వాటా 49.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. ప్రైవేటు రంగంలో రూ.1,36,946.3 కోట్ల విలువైన 711 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రాజెక్టులు అమల్లోకి వస్తున్న సంఖ్యలో కూడా వృద్ధి నమోదవుతోందని వివరించింది. అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో రూ.1,29,388.84 కోట్ల విలువైన 1,237 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని, ఇది అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 120 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. 

అక్టోబర్‌ – డిసెంబర్‌లో ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు