ఏపీలో కుండపోత.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

7 Oct, 2022 07:43 IST|Sakshi

ప్రకాశం జిల్లాలో అత్యధిక వర్షపాతం

మరో రెండు రోజులు వానలు

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పూర్తి స్థాయిలో నిండిన కంభం చెరువు

సాక్షి, అమరావతి: కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడతాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం

బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 14.40 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కురిసింది. కనిగిరి మండలం ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రాంతంలో 14.27 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లా నగరం పరిధిలో 13.80 సెంటీ మీటర్లు, ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరంలో 13.05 సెంటీమీటర్లు, ఒంగోలు మండలం ఏరరేజర్ల ప్రాంతంలో 13 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ప్రకాశం జిల్లా కంభం చెరువు పూర్తిస్థాయిలో నిండింది.  

మరిన్ని వార్తలు