విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు 

27 Apr, 2021 04:18 IST|Sakshi
ఎగుమతుల విలువ (రూ.కోట్లలో)

వరుసగా రెండో ఏడాది రూ.లక్ష కోట్లపైగా ఎగుమతులు 

2020–21లో రాష్ట్రం ఎగుమతుల విలువ రూ.1,07,730.13 కోట్లు 

కరోనా సమయంలోనూ 2.76 శాతం పెరుగుదల 

మందులు, బియ్యం, బంగారు ఆభరణాల ఎగుమతుల్లో భారీ వృద్ధి 

సాక్షి, అమరావతి: ఒకపక్క కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు మందగిస్తే.. విదేశీ ఎగుమతుల్లో మన రాష్ట్రం రికార్డు సృష్టించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రూ.లక్ష కోట్లు దాటిన విదేశీ ఎగుమతులు.. వరుసగా రెండో ఏడాది కూడా అదే జోరు కొనసాగించాయి. 2019–20తో పోలిస్తే 2020–21లో రాష్ట్ర ఎగుమతుల్లో 2.76 శాతం వృద్ధి నమోదైంది. 2019–20లో రూ.1,04,828.84 కోట్లుగా ఉన్న ఎగుమతులు 2020–21లో రూ.1,07,730.13 కోట్లకు చేరాయి. రాష్ట్రం నుంచి 2017–18లో రూ.84,640.56 కోట్లు, 2018–19లో రూ.98,983.95 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క కోవిడ్‌–19 వ్యాప్తి నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోపక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా సమగ్రమైన ప్రణాళికను అమలు చేయడం ద్వారా ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధ్యమైందని అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో చాలా దేశాలు చేపలు, రొయ్యలతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులపై నిషేధం విధించినప్పటికీ ఆ ప్రభావం ఎగుమతుల ఆదాయంపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా దేశంలోనే మొదటిసారిగా రీస్టార్ట్‌ పేరుతో కోవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ గతేడాది ఏప్రిల్‌ 20 నుంచే పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇవ్వడం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రమణ్యం చెప్పారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కూడా పరిశ్రమల కార్యకలాపాలకు ఆటంకాలు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  

వృద్ధిలో పది రంగాలు కీలకం..  
రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో పది రంగాలు కీలకపాత్ర పోషించాయి. డ్రగ్‌ ఫార్ములేషన్స్‌ (ఔషధాలు), స్టీల్‌–ఐరన్, బంగారు ఆభరణాలు, బియ్యం, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్యుత్‌ ఉపకరణాలు వంటి ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రం నుంచి రూ.13,383.11 కోట్ల విలువైన డ్రగ్‌ ఫార్ములేషన్స్, బయలాజికల్స్‌ ఎగుమతి అయ్యాయి. అంతకుముందు ఏడాది జరిగిన రూ.10,510.65 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది. కరోనా వ్యాధిని నియంత్రించడానికి వినియోగించే హెచ్‌సీక్యూ200, అజిత్రోమైసిన్‌ వంటి అనేక ఔషధాలకు డిమాండ్‌ రావడం వాటి ఎగుమతులు పెరగడానికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఉక్కు, ఇనుము వంటి లోహాలకు డిమాండ్‌ పెరగడంతో వీటి ఎగుమతుల్లో కూడా వృద్ధి నమోదైంది.

ఇనుము, ఉక్కు ఎగుమతులు రూ.6,485.72 కోట్ల నుంచి 22.82 శాతం వృద్ధితో రూ.7,965.97 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి రికార్డు స్థాయిలో రూ.4,928.86 కోట్ల విలువైన బాస్మతియేతర బియ్యం ఎగుమతి కావడం గమనార్హం. ఇది గతేడాదితో పోలిస్తే 159 శాతం అధికం. ఆఫ్రికా వంటి దేశాల నుంచి బియ్యానికి డిమాండ్‌ రావడం ఎగుమతులు పెరగడానికి కారణంగా పేర్కొంటున్నారు. అలాగే మన రాష్ట్రం నుంచి 436 శాతం వృద్ధితో రూ.2,841.66 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎగుమతి అయ్యాయి. గత మూడేళ్లుగా రాష్ట్ర ఎగుమతుల్లో కీలకపాత్ర పోషిస్తున్న సముద్ర ఉత్పత్తులు, నౌకలు బోట్ల ఎగుమతులు మాత్రం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.16,938.48 కోట్ల సముద్ర ఉత్పత్తులు, రూ.13,470.52 కోట్ల ఓడలు, బోట్లు ఇతర పరికరాల ఎగుమతులు జరిగాయి.  

మరిన్ని వార్తలు