సీఎం హామీ ఇచ్చిన తర్వాత నిరసనలెందుకు? 

8 Dec, 2021 05:30 IST|Sakshi

బండి శ్రీనివాసరావు, బొప్పరాజుకు రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ దివాకర్‌ ప్రశ్న 

పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం వైఎస్‌ జగన్‌పై పూర్తి నమ్మకముందని వెల్లడి 

రెవెన్యూ జేఏసీలోని సంఘాలు నిరసనల్లో పాల్గొనట్లేదని స్పష్టీకరణ  

అమలాపురం టౌన్‌: పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉందని రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వీఎస్‌ దివాకర్‌ తెలిపారు. సీఎం హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలు ఎందుకని ప్రశ్నించారు. పీఆర్సీ సాధన కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకుంటున్న రెండు జేఏసీల నిరసనల్లో రెవెన్యూ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదన్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వీఎస్‌ దివాకర్‌ మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ జేఏసీలో భాగస్వాములుగా ఉన్న ఏపీ గ్రామ సహాయకుల సంఘం, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్, ఏపీ తహసీల్దార్‌ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్‌ అసోసియేషన్‌లు జేఏసీల నిరసనల్లో పాల్గొనడం లేదని చెప్పారు.

జేఏసీల చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు వెనుక రెవెన్యూ ఉద్యోగులెవరూ లేరన్నారు. పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఉద్యమ కార్యాచరణలోకి దిగడమేమిటని ప్రశ్నించారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. 2019 ఎన్నికలప్పుడు రాష్ట్ర సచివాలయం నుంచి బొప్పరాజు వెంకటేశ్వర్లు తహసీల్దార్లకు ఫోన్లుచేసి టీడీపీకి ఓటు వేయించాలంటూ ఆదేశాలిచ్చారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పీఏ డైరీలో బొప్పరాజుకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు రాసి ఉందంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణాల కోసం చేసిన వసూళ్లపైనా బొప్పరాజు సమాధానం చెప్పాలన్నారు.  

సీఎంపై ఉద్యోగులకు నమ్మకముంది
ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల
సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారని నమ్ముతున్నట్లు ఏపీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల వరద ప్రాంతాల పర్యటన సందర్భంగా కలసిన ఉద్యోగులకు సీఎం పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించడాన్ని గమనించాలన్నారు. 

మరిన్ని వార్తలు