హర్షకుమార్‌ మాతో బహిరంగ చర్చకు సిద్ధమా: కనకరావు

13 Aug, 2020 18:55 IST|Sakshi

ప్రసాద్‌ రాష్ట్రపతికి లేఖ రాయడం వెనుక చంద్రబాబు, హర్షకుమార్ ఉన్నారు

సాక్షి, తాడేపల్లి: ‘హర్షకుమార్‌కు సరదాగా ఉంటే నక్షలైట్లలో చేరాలి. ఆయనతో పాటు చంద్రబాబు కూడా నక్సలైట్లలో చేరాలి. అంతే తప్ప దళిత యువకులను రెచ్చగొట్టవద్దు’ అంటూ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత యువకుడి శిరోమండనం కేసులో తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. దళిత బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని తెలిపారు.

అంతేకాక బాధిత బాలికకు ప్రభుత్వం పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇచ్చిందన్నారు. ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేశారని తెలిపారు. చంద్రబాబు దళితులను నీచంగా చూశారని అమ్మాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు. అప్పుడు ఎందుకు హర్షకుమార్ నోరు మెదపలేదన్నారు. దళితుల కోసం మీడియా సమావేశం పెట్టిన హర్షకుమార్‌ మూడు రాజధానులు కోసం ఎందుకు మాట్లాడుతున్నారని అమ్మాజీ ప్రశ్నించారు.

చంద్రబాబు కాళ్లు పట్టుకున్న నిన్ను ఎవరూ నమ్మరు: కనకరావు
హర్షకుమార్‌, చంద్రబాబు మీద మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌ల్లో హర్షకుమార్ ఒకరు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజికి అతడు కక్కుర్తి పడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న హర్షకుమార్‌ దళిత సమస్యలపై పోరాటం చేస్తామంటే ఎవరూ నమ్మరు. దళితులపై దాడి చేసిన చరిత్ర టీడీపీది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగాయి. ప్రసాద్‌ రాష్ట్రపతికి లేఖ రాయడం వెనుక చంద్రబాబు, హర్షకుమార్ ఉన్నారు’ అని ఆయన ఆరోపించారు.

అంతేకాక ‘యానాంలో రిజెన్సీ సిరామిక్ సంఘటనలో యాజమాన్యంతో కుమ్మక్కై దళితులు, బీసీలకు అన్యాయం చేశావు. అమరావతిలో భూ కుంభకోణంపై హర్షకుమార్ ఎందుకు మాట్లాడలేదు. రాజధానిలో దళితుల భూములను బలవంతంగా లాక్కున్నపుడు హర్షకుమార్ ఎందుకు నోరు మెదపలేదు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబుకు మా గురించి మాట్లాడే అర్హత లేదు. ఏడాది కాలంలో ఎస్సీ సంక్షేమంపై బహిరంగ చర్చకు మేము సిద్ధం. మాతో చర్చకు హర్షకుమార్, టీడీపీ నేతలు సిద్ధమా? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళిత పక్షపాతి. వారి సంక్షేమం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు’ అన్నారు కనకరావు.

మరిన్ని వార్తలు