విలీన స్కూళ్లలో టీచర్ల కొరతకు చెక్‌

13 Nov, 2021 04:38 IST|Sakshi

సరిపడినంత మంది సిబ్బంది ఏర్పాటుకు చర్యలు

3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టుల బోధనకు 4 ఎస్జీటీ, లేదా ఎస్‌ఏలు

6, 7 తరగతుల్లో 6 సబ్జెక్టులకు ఆరుగురు ఎస్‌ఏలు

 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టుల కోసం ఏడుగురు ఎస్‌ఏలు

1, 2 తరగతులతో ఉండే ప్రాథమిక స్కూళ్లకు కిలోమీటర్‌ దూరంలోని అంగన్‌వాడీల అనుసంధానం

సాక్షి, అమరావతి: నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే చదువుల్లో గట్టి పునాది వేసేందుకు ఫౌండేషన్‌ స్కూల్‌ విధానానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పిల్లల్లో ఆరో ఏడు వచ్చేసరికే అక్షర జ్ఙానాన్ని పెంపొందించడం, 3వ తరగతి నుంచి సబ్జెక్టు వారీ బోధనతో ఆ పునాదులను మరింత పటిష్టం చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు, ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లు అనే ఆరంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అదే ఆవరణ, లేదా 250 మీటర్ల లోపు హైస్కూళ్లకు అనుసంధానిస్తారు. ఈ స్కూళ్లలో 3, 4, 5  తరగతుల విద్యార్థులకు కూడా సబ్జెక్టులవారీగా మంచి బోధన అందుతుంది. హైస్కూళ్లలోని ల్యాబ్‌లు, గ్రంధాలయాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు కూడా ఈ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రాథమిక పాఠశాలల్లో అందని విజ్ఞానాన్ని ఇక్కడ పొందుతారు. హైస్కూళ్లలో తరగతులు పెరుగుతున్న నేపథ్యంలో టీచర్ల కొరత ఏర్పడకుండా బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసేలా రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లకు విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ముందుగా పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ను అనుసరించి టీచర్లు అవసరమున్న స్కూళ్లను గుర్తించాలని పేర్కొంది.  

టీచర్ల సర్దుబాటుకు విధివిధానాలు..

  • సాధారణంగా 3 నుంచి 10 వరకు సింగిల్‌ సెక్షన్‌తో నడిచే హైస్కూళ్లలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌.ఏ) (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), ఇతర సబ్జెక్టులకు 9 మంది స్కూల్‌ అసిస్టెంట్లు/బీఈడీ అర్హతలున్న ఎస్జీటీలు ఉండాలి. కానీ ఇక్కడ సబ్జె క్టులవారీ టీచర్లను నియమిస్తారు.
  • 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులకు నలుగురు, 6, 7 తరగతుల్లో 6 సబ్జెక్టులకు ఆరుగురు, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టుల బోధనకు ఏడుగురు టీచర్లు ఉండనున్నారు. టీచర్‌కు వారంలో 30 నుంచి 32 గంటలకు మించి పనిభారం పడకుండా, 45 పీరియడ్లకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
  • టీచర్ల సర్దుబాటుకు ప్రస్తుతం స్కూల్‌ కాంప్లెక్సు, మండల, డివిజన్, జిల్లాలవారీగా మిగులు టీచర్లను గుర్తించాలి
  • 6, 7 తరగతుల విద్యార్థుల సంఖ్య 35కన్నా తక్కువగా ఉన్నా, మ్యాపింగ్‌ తరువాత 75 కన్నా తక్కువగా విద్యార్థులున్న అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లలోని ఎస్‌ఏలను గుర్తించాలి. ఎస్జీటీలలో బీఈడీ అర్హతలున్న వారిని గుర్తించాలి. వీరిని స్కూల్‌ కాంప్లెక్సు, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో మ్యాపింగ్‌ పూర్తయిన స్కూళ్లలో సర్దుబాటు చేయాలి
  • 20 కన్నా విద్యార్థులు తక్కువ ఉన్న స్కూళ్లలో ఇద్దరు ఎస్జీటీలు ఉంటే వారిలో ఒకరిని హైస్కూలుకు డిప్యుటేషన్‌పై పంపాలి. ఇందుకు అధిక విద్యార్హతలున్న వారిని ఎంపిక చేయాలి. హైస్కూలుకు డిప్యుటేషన్‌పై వెళ్లే ప్రాథమిక స్కూళ్ల టీచర్లు హైస్కూలు హెడ్మాస్టర్‌ పర్యవేక్షణలో ఉంటారు.
  • ఒకే ఆవరణలో లేదా 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు హైస్కూలుకు అనుసంధానమయ్యే చోట అక్కడి మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది కూడా అదే రీతిలో సర్దుబాటు అవుతారు. 
  • 3, 4, 5 తరగతులు హైస్కూళ్లలో విలీనమయ్యే ప్రాథమిక పాఠశాలలకు సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేయాలి.  
మరిన్ని వార్తలు