-

20 శాతం మందికి వైరస్‌ వచ్చి పోయింది

10 Sep, 2020 18:46 IST|Sakshi

త్వరలో 4 జిల్లాల్లో కేసులు తగ్గుతాయి

పశ్చిమ గోదావరిలో కేసులు పెరిగే అవకాశం

సంచలన విషయాలు వెల్లడించిన ఏపీ సీరో సర్వే

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొందరిలో వారికి తెలియకుండానే వైరస్‌ వచ్చి తగ్గిపోతుంది. ఇలాంటి వారిని అంచాన వేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా సీరో సర్వైలెన్స్‌ నిర్వహించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. ముందుగా తూర్పుగోదావరి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహించారు. ఆ తర్వాత ఆగస్టు 26 నుంచి 31 వరకూ మిగిలిన 9 జిల్లాల్లో సర్వే జరిగింది. వీటి ఫలితాలను ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది.

ఈ సందర్భంగా కమ్యూనల్‌ డీసీజ్‌ ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం సీరో సర్వేలేన్స్‌ చేపడతారన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్. కోవిడ్-19 వ్యాప్తిని అంచనా వేయడానికి ఈ సీరో సర్వే చేశామన్నారు. దేశంలో తొలుత హరియాణాలో ఈ సర్వే చేయగా.. ఆ తర్వాత ఏపీలోనే చేశామని తెలిపారు. ఇందుకు గాను రెండు దశల్లో సీరో సర్వే నిర్వహించామన్నారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో ఐదు వేల మంది శాంపిల్స్‌ టెస్ట్‌ చేశామన్నారు. పూర్తిగా ఏ లక్షణాలు లేని వారి మీద కూడా ఈ సర్వే చేపట్టామన్నారు. (కరోనా నియంత్రణకు నిర్దిష్ట ప్రణాళిక)

కాటంనేని భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘అనంతపురం, కృష్ణా, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 5 నుంచి 15 వరకు మొదటి దశ సర్వే లెన్స్‌ నిర్వహించాం. దీనిలో భాగంగా 3500 మంది శాంపిల్స్ సీరో సర్వే చేశాం. ఆ తర్వాత రెండో దశలో భాగంగా ఆగస్టు 26 నుంచి 31 వరకు మిగతా జిల్లాల్లో 5వేల మందికి చొప్పున సర్వే చేశాం. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక రౌండ్‌ సిరో సర్వే పూర్తయ్యింది. దీని వల్ల ఇప్పటికే 19.7శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో 18.2 శాతం.. పట్టణ ప్రాంతంలో 22.5 శాతం.. కంటైన్మెంట్ జోన్‌లలో 20.5 శాతం.. నాన్ కంటైన్మెంట్ జోన్‌లలో19.3 శాతం.. హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5 శాతం మందికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గిపోయినట్లు తెలుస్తోంది అన్నారు. పురుషుల్లో 19.5 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్ధారణ కాగా.. మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు‌. (పారదర్శకంగానే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోళ్లు)

ఈ సర్వే ద్వారా త్వరలోనే కర్నూల్, విజయనగరం జిల్లాలో కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశామన్నారు భాస్కర్‌. అలానే రానున్న రోజుల్లో చిత్తూరు, విశాఖలో తగ్గుముఖం పట్టనుండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందని సీరో సర్వే ద్వారా అంచనా వేయడం జరిగిందన్నారు. ఇక్కడ పరీక్షలు ఎక్కువగా చేస్తాం, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.  

మరిన్ని వార్తలు