YSRCP Plenary 2022: ప్లీనరీ పండగ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చోవాలా?: తమ్మినేని

9 Jul, 2022 11:45 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్‌ నామస్మరణే వినిపిస్తోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ రెండవరోజు పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకతపై మొదటగా తమ్మినేని ప్రసంగించారు. తమ్మినేని మాటల్లో.. 'మూడేళ్ల ప్రగతిపై సమీక్షే ఈ ప్లీనరీ. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్లీనరీకి విప్లవంలా తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే మన ముందున్న లక్ష్యం అని అన్నారు. 

'ఈ రోజు ఎల్లో పత్రికలు స్పీకర్‌ పదవిలో ఉండి ప్లీనరీకి ఎలా హాజరవుతారంటూ నాపై కథనాలు రాశాయి. రామోజీరావు, ఏబీఎన్‌లకు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్‌ శివప్రసాద్‌ పాల్గొనలేదా?. ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా? (ఆర్‌ యూ  డెఫ్‌ ఇయర్‌).. మీరు కనలేదా? (ఆర్‌ యూ బ్లైండ్‌). ఆయన ప్లీనరీకి హాజరవగా లేనిది.. నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా?. నేను వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను..ఆ తర్వాతే స్పీకర్‌ను. ప్లీనరీ పండగ జరుగుతుంటే.. నేను ఇంటోల కూర్చోవాలా..?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

చదవండి: (చంద్రబాబు చిత్తూరు టూర్‌ అట్టర్‌ ప్లాప్‌.. అడుగడుగునా అసహనం!)

పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు
రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చారు. వీటి గురించి ఎందుకు రాయదు ఎల్లో మీడియా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం జగన్‌తో ప్రయాణించేందుకు మేం అందరం సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ రథాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి. అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 175 స్థానాలు గెలిచి తీరుతుంది అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు