ఏపీ: బాలల కోసం స్పెషల్‌ బడ్జెట్‌ 

21 May, 2021 11:29 IST|Sakshi

39 పథకాల కింద రూ.16,748.47 కోట్లు 

పిల్లల వికాసమే లక్ష్యంగా కేటాయింపులు

సాక్షి, అమరావతి: రేపటి పౌరులైన నేటి బాలల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక ముందడుగు వేసింది. ప్రాథమిక హక్కులు, బాలల సంక్షేమం కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపక్రమించారు. రాష్ట్ర బడ్జెట్‌లో పిల్లలకు తగిన ప్రాధాన్యమిస్తూ ‘పిల్లల బడ్జెట్‌’ను ప్రభుత్వం రూపొందించింది. 2021–22 వార్షిక బడ్జెట్‌లో వివిధ శాఖల ద్వారా 18 ఏళ్లలోపు పిల్లల కోసం ఏకంగా రూ.16,748.47కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో పిల్లల కోసం కేటాయింపులను ప్రత్యేక నివేదిక రూపంలో ప్రభుత్వం వెలువరించింది. బాలల సర్వతోముఖాభివృద్ధికి మూడు కేటగిరీలుగా ఈ నిధులను కేటాయించారు. నేరుగా సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పన/ఆర్థిక సహకారం, శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాల అభివృద్ధి కేటగిరీలుగా నిధులు కేటాయించినట్టు నివేదికలో పేర్కొన్నారు.  

రెండు విభాగాలు.. 39 పథకాలు  
► పిల్లల సంక్షేమం, అభివృద్ధి కోసం రూపొందించిన వివిధ పథకాలు, వాటికి నిధుల కేటాయింపు వివరాలను ప్రభుత్వం రెండు విభాగాల కింద తన నివేదికలో పేర్కొంది. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 39 పథకాలు ఉన్నాయి.  
► మొదటి విభాగంలో 100 శాతం పిల్లల కోసం రూపొందించిన పథకాలకు కేటాయింపులను పొందుపరిచారు. ఆ పథకాల కోసం రూ.12,218.64 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పూర్తిగా పిల్లల కోసం కేటాయించిన 20 పథకాలను ఈ విభాగంలో చేర్చారు.  
► రెండో విభాగంలో 100 శాతం కంటే తక్కువ నిధులను పిల్లల కోసం కేటాయిస్తూ రూపొందించిన పథకాలను పొందుపరిచింది. ఆ పథకాల కోసం ప్రభుత్వం రూ.4,529.83 కోట్లు కేటాయించింది. ఈ విభాగంలో 19 పథకాలను చేర్చారు.  

పాఠశాల విద్యా శాఖదే సింహభాగం 
►పిల్లల బడ్జెట్‌ కేటాయింపుల్లో శాఖల వారీగా చూస్తే పాఠశాల విద్యా శాఖ మొదటి స్థానంలో ఉంది. ఆ శాఖకు రూ.8,228.67 కోట్లు కేటాయించారు.  
► రూ.3,314.90కోట్ల కేటాయింపులతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రెండో స్థానంలో నిలిచింది. పిల్లలకు రూ.1,169.62 కోట్ల కేటాయింపులతో వైద్య, ఆరోగ్య శాఖ మూడో స్థానంలో ఉంది. 

చదవండి: AP Budget 2021: ఆరోగ్యశ్రీ పథకానికి రూ.2,258 కోట్లు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు