AP: డెంగీ కట్టడికి స్పెషల్‌ డ్రైవ్‌ 

8 Nov, 2021 08:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

క్షేత్రస్థాయి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారులతో ర్యాండమ్‌ సర్వే 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో డెంగీ కేసులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. డెంగీ జ్వరాల బారిన పడిన వారికి ఓ వైపు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ.. కేసుల నియంత్రణకు కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ చర్యల ఫలితంగా కేసుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. నియంత్రణ చర్యలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు 13 జిల్లాలకు 13 మంది సీనియర్‌ అధికారులను పర్యవేక్షకులుగా వైద్య, ఆరోగ్య శాఖ నియమించింది.

వీరు తమకు కేటాయించిన జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి డ్రై డే, ఇంటింట సర్వే, ఫాగింగ్‌ తదితర కార్యక్రమాలు సక్రమంగా చేపడుతున్నారా లేదా అన్నది పరిశీలించి లోటుపాట్లను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. తదనుగుణంగా తదుపరి చర్యలు ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. 

మూడు రోజులు డ్రై డే 
డెంగీ కారక దోమల నివారణకు ప్రస్తుతం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం అమలవుతోంది. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు, గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలోని ప్రజలకు దోమల నివారణపై చైతన్యం కల్పిస్తున్నారు. ఆ రోజు నీటి నిల్వలున్న బాటిళ్లు, టైర్లు, ప్లాస్టిక్‌ కుండీలు, ట్యాంకులను శుభ్రం చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కలి్పస్తారు. ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజులో ప్రభావవంతంగా చేపట్టడానికి వీలు పడటం లేదు. దీంతో మూడు రోజులపాటు (శుక్ర, శని, ఆది) ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

తద్వారా సచివాలయాల పరిధిలోని అన్ని ఇళ్లకు సిబ్బంది కచ్చితంగా వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 14,986 సచివాలయాల పరిధిలో 1.62 కోట్ల గృహాల వారికి అవగాహన కల్పిస్తారు. ఇప్పటివరకూ 2,92,283 గృహాల్లో దోమలు గుడ్లు పెట్టినట్టు గుర్తించి నిర్మూలించారు. 3,006 నీళ్ల ట్యాంక్‌లను శుభ్రం చేయించారు. ఏఎన్‌ఎంలు తమ పరిధిలో ఎక్కడైనా మురుగు కాలువలు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వెక్టర్‌ కంట్రోల్‌ హైజీన్‌ యాప్‌ ద్వారా పంచాయతీ, మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ ఏఎన్‌ఎంలు 1,60,453 సమస్యలను లేవనెత్తారు. వీటిలో 1,14,464 సమస్యలు పరిష్కారం కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 

రాష్ట్రస్థాయిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఏర్పాటు 
డెంగీ నివారణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేలా రాష్ట్ర స్థాయిలో స్పెషాలిటీ వైద్యులతో 6 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌(ఆర్‌ఆర్‌టీ)లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్టోబర్‌ 25 నుంచి 31 వరకూ రాష్ట్రంలో 193 డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క విశాఖపట్నంలోనే 43, తూర్పు గోదావరిలో 38, గుంటూరులో 20 చొప్పున.. మూడు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. శ్రీకాకుళంలో 19, ప్రకాశం జిల్లాలో 16 మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో కేసుల నమోదు తక్కువగానే ఉంది.

ఈ నేపథ్యంలో కేసుల నమోదుపై ప్రభుత్వం ఎంటమలాజికల్‌ స్టడీ చేపడుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న విశాఖపట్నం, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు, మిగిలిన జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఎంటమలాజికల్‌ స్టడీ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు మురుగు నీటి కుంటలు, కాలువల్లో దోమ లార్వాలను తినే 24.75 లక్షల గంబూషియా చేప పిల్లలను వదిలారు. 

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 సెంటినల్‌ సర్వైలెన్స్‌ ఆస్పత్రులు ఉండేవి. వీటిలోనే డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ప్రభుత్వం వీటి సంఖ్యను 54కు పెంచింది. ఈ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 58,949 డెంగీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, డెంగీ బారిన పడిన వారికి వైద్యం, మందులు ఈ ఆస్పత్రుల్లో అందిస్తున్నారు. విష జ్వరాలను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. 

ప్రతి కేసూ సూక్ష్మ పరిశీలన 
రాష్ట్రంలో నమోదవుతున్న డెంగీ, మలేరియా ప్రతి కేసును సూక్ష్మంగా పరిశీలిస్తున్నాం. కేసు నమోదు కావడానికి కారణాలేమిటనేది అన్వేషించి నివారణ చర్యలు చేపడుతున్నాం. కేసులు నమోదైన ప్రాంతాలను వైద్యుల బృందం పరిశీలించి మునిసిపల్, పంచాయతీరాజ్‌ అధికారుల సమన్వయంతో నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైనన్ని టెస్టింగ్‌ కిట్‌లు, మందులు అందుబాటులో ఉంచాం.     – కాటమనేని భాస్కర్, కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ

ఈ ఏడాది అక్టోబర్‌ నెలాఖరు వరకూ నమోదైన కేసులు ఇలా.. 

జిల్లా   కేసుల సంఖ్య     
శ్రీకాకుళం    120 
విజయనగరం  177 
విశాఖపట్నం  899 
తూర్పు గోదావరి  506 
పశ్చిమ గోదావరి    221 
కృష్ణా  153 
గుంటూరు   565 
ప్రకాశం  134 
నెల్లూరు   46 
చిత్తూరు    98 
వైఎస్సార్‌  27 
కర్నూలు    181 
అనంతపురం  154 
మొత్తం  3,281


  

  
  
  

    
 


  
    

మరిన్ని వార్తలు