బుల్లెట్‌ గ్యారేజ్‌.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును!

5 Jun, 2022 14:43 IST|Sakshi

సాక్షి,విజయనగరం: నీ బుల్లెట్‌ బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గు.. డుగ్గు...డుగ్గు.. డుగ్గని.. అందాల దునీయాను చూపించప్పా.. చిక్కుచిక్కు చిక్కుని.. చిక్కుబుక్కని.. అంటూ ఇటీవల అందరినీ అలరించిన ఈ పాట వింటే చాలు గుర్తుకు వచ్చేది రోయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండి. రెండు దశాబ్దాలకు పూర్వం స్టేటస్‌ సింబల్‌గా భావించే ఈ రెండు చక్రాల వాహనం డుగ్గు... డుగ్గు అంటూ నడిపితే ఆ రాజసమే వేరు. పూర్వం గ్రామాల్లో సర్పంచ్‌లు.. నాయుడులు వాడే ఈ వాహనం అన్ని వర్గాల ప్రజల మనుసుదోచుకుంటుంది. ఇంతటి చరిత్ర ఉన్న బుల్లెట్‌ బండికి రిపేర్‌వస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠక్కున గుర్తుకు వచ్చేది ఈశ్వరరావు పేరే.

చిన్నపాటి మరమ్మతు నుంచి ఇంజిన్‌రిపేర్‌ వరకు ఆయన చేయి పడనిదే బండి రోడెక్కెని పరిస్థితి. అందుకే.. విజయనగరం నడిబొడ్డున గల మహాకవి గురజాడ అప్పారావు కూడలిలోని ఆయన చిన్నపాటి చెక్కబడ్డీ ముందు బుల్లెట్‌ బైక్‌లు క్యూ కడతాయి. అన్నీ సర్వీసింగ్‌ కోసమే వచ్చినవే. వాటిని రిపేర్‌ చేసే వ్యక్తి మాత్రం 7వ తరగతి వరకే చదివి.. మెకానిక్‌లో ఇంజినీరింగ్‌ ప్రావీణ్యం సంపాదించిన కోరాడ వీధికి చెందిన గొలుసు ఈశ్వరరావు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన చిన్నతనంలో బైక్‌ మైకానిక్‌ వృత్తిని ఎంచుకున్నారు. మొదటిగా బ్రహ్మాజీ అనే గురువు వద్ద ద్విచక్ర వాహనాల మరమ్మతులు చేయడంలో శిక్షణ పొందారు. 

అనంతరం గాంధీ గురువు వద్ద రోయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు రిపేర్‌లు చేయడం నేర్చుకున్నారు. నమ్మిన వృత్తిని ఇష్టంగా భావించిన ఆయన ఆ రంగంలో తనకు వేరెవ్వరు సాటిలేరన్నంత నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ఆయన గ్యారేజ్‌ వద్ద పదుల సంఖ్యలో ఎన్‌ఫీల్డ్‌ వాహనాలకు రిపేర్లు చేస్తూ వాహన చోదకుల మన్ననలు పొందుతున్నారు.  

శబ్దాన్నిబట్టి సమస్యను గుర్తించేంత నైపుణ్యం..  
ఈశ్వరరావు తన గురువు గాంధీ వద్ద  నేర్చుకున్న బుల్లెట్‌ వాహనాల రిపేర్ల వృత్తిని వ్యక్తిగత ఉపాధిగా మలచుకున్నారు. 2000 సంవత్సరం నుంచి చిన్నపాటి గ్యారేజీ ప్రారంభించి బుల్లెట్‌లకు రిపేర్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు అరకొరగా ఉన్న రోజుల్లో... మేడిన్‌ ఇంగ్లాడ్‌ పేరిట అప్పట్లో వాడే 1965, 1975, 1985 మోడల్‌ వాహనాలకు రిపేర్‌ చేయడంలో మంచి పరిణితి పొందిన మెకానిక్‌గా గుర్తింపు సాధించారు. బుల్లెట్‌ శబ్దాన్ని బట్టి సమస్యను గుర్తించేంత విజ్ఞానం ఈశ్వరరావు సొంతం. అందుకే.. బుల్లెట్‌లో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఆయన గ్యారేజ్‌కు తెస్తారు. ఎన్‌ఫీల్డ్‌  వాహనంలో మార్పులు చోటు చేసుకుని నేటితరాన్ని ఆకట్టుకునే మోడళ్లు రావడం, వాహనాల సంఖ్య పెరగడంతో ఆయనకు ప్రతిరోజూ చేతినిండా పనిదొరుకుతోంది. మరో నలుగురు కుర్రాళ్లకు ఉపాధి చూపుతున్నారు. 

నా గురువులు బ్రాహ్మాజీ, గాంధీలు నేర్పించిన విద్యతో నేడు నేను ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురు కుర్రాళ్లకి ఉపాధి కల్పిస్తున్నాను. అప్పట్లో ఊరికో ఎన్‌ఫీల్డ్‌ బండి ఉండేది. రోజుకో, రెండు రోజులుకో ఒక బండి షెడ్‌కి వచ్చేది. దానికి మరమ్మతులు చేసే వాడిని. ప్రస్తుతం రోయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాల సంఖ్య పెరిగింది. రోజుకు పదుల సంఖ్యలో వాహనాలు షెడ్‌కు వస్తున్నాయి. జనరల్‌ సర్వీసు అయితే గంటలో చేసిస్తాం. అదే ఇంజిన్‌ మరమ్మతులు అయితే రెండు, మూడు రోజుల సమయం తీసుకుంటాం. 
– గొలుసు ఈశ్వరరావు, రోయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మెకానిక్, విజయనగరం  

చదవండి: నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేశారా?

మరిన్ని వార్తలు