AP: టెన్త్‌ పరీక్షలకు 6.22 లక్షల మంది విద్యార్థులు

26 Apr, 2022 11:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి(బుధవారం) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 27 నుంచి మే 6 వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. డైలీ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల​ వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలకు 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలను 2 వేల నుంచి 3800లకు పెంచినట్లు అధికారులు తెలిపారు. 

పరీక్షలపై టెన్‌షన్‌ వద్దు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం లేకపోవడంతో ఈ నెల 27వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ఇంటర్మీడియెట్‌ పరీక్షల సైతం మే ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొనడం సహజం. దానిని అధిగమించి, భయాందోళనలను విడనాడి, సానుకూల దృక్పథంతో పరీక్షలు రాస్తే విజయం తథ్యమని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల వేళ విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంటున్నారు. చదువుకోవడంతోపాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే పరీక్షల గండాన్ని దిగ్వి జయంగా అధిగమించొచ్చని వివరిస్తున్నారు. 
ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ 
► ప్రస్తుతం విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. 
► పరీక్ష రాసేందుకు వెళ్తూ హడావుడిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటారు. అయితే ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవడం ముఖ్యం.  
► పరీక్ష నుంచి రాగానే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తాగాలి.  
► రాత్రి వేళల్లో గోరువెచ్చటి పాలు తీసుకుంటే మంచిది. 
► పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా వత్తిడికి గురవుతారు. సరిగా నిద్రపోక నీరసించిపోతారు. 
► ఈ సమయంలో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.  
► డ్రైఫ్రూట్స్‌లో కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. బాధం, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, అంజూరి వంటి డ్రై ఫ్రూట్స్‌ను దగ్గర ఉంచుకుని, చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో తినాలి.

తల్లిదండ్రుల బాధ్యతలు ఇవీ.. 
► ఇంట్లో ప్రశాంతంగా చదువుకునే వాతవరణం కల్పించి, సరైన సమయంలో ఆహారం తీసుకునేలా చూడాలి. 
► పరీక్షలు బాగా రాయగలవంటూ పిల్లలను సానుకూల దృప్పథంతో ప్రోత్సహించాలి. 
► పరీక్షల సమయంలో టీవీ పెట్టవద్దంటూ నిషేధం విధించడం సరికాదు. రోజుకు పది నిమిషాలపాటు టీవీ చూడటం ద్వారా ఉపశమనం పొందుతారు.  
► పరీక్షల సమయమైనా రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర ఉండేలా చూడటం ముఖ్యం. 
► పరీక్షలకు అవసరమైన హాల్‌టికెట్, పెన్ను, ప్యాడ్‌ ఇలా అవసరమైన వస్తువులను ఒకే చోట అందుబాటులో ఉంచాలి.  
► కనీసం 20 నిమిషాలు ముందగానే పరీక్ష కేంద్రానికి పిల్లలను పంపించాలి. ఆలస్యమైతే ఆందోళనతో పిల్లలు సరిగా పరీక్ష రాయలేరు. 

ఏర్పాట్లు పూర్తి 
పదో తరగతి పరీక్షలకు సంబం«ధించి ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఏడు పేపర్లు రాయాలి. అందుకు అనుకుణంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం. ఇప్పటికే మోడల్‌ పరీక్షలు, ప్రీఫైనల్‌ నిర్వహించాం. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి. పరీక్ష హాళ్లలో అన్ని వసతులూ కల్పించాం. విద్యార్థులు మంచినీరు తాగేటప్పుడు గది బయటకు వచ్చి తాగితే  మంచిది. పేపర్‌పై నీరు పడకుండా ఉంటుంది. విద్యార్థులకు టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం.  
– సి.వి.రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి, ఎన్టీఆర్‌ జిల్లా 

ఆందోళనకు గురికాకూడదు
పరీక్షల వేళ వత్తిడికి గురికాకూడదు. రోజులో ఆరు గంటల నిద్ర అవసరం. పరీక్ష హాలుకు 20 నిమిషాలు ముందుగా చేరుకోవాలి. ప్రశ్న పత్ర ఇచ్చాక దానిని మొత్తం చదివి బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయాలి. ఏ ప్రశ్ననూ వదలకుండా అన్నింటికీ సమాధానాలు రాయడం మంచిది. పరీక్ష రాసి ఇంటికి వెళ్లాక గంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. అనంతరం మురుసటి రోజు పరీక్ష సిలబస్‌ను రివిజన్‌ మాత్రమే చేయాలి. కొత్త అంశాల జోలికి వెళ్లకూడదు. ఆత్మస్థైర్యంతో పరీక్ష రాస్తే విజయం తథ్యం. 
– డాక్టర్‌ గర్రే శంకరరావు, మానసిక నిపుణుడు

మరిన్ని వార్తలు