'టెన్‌'షన్‌ వద్దు!

6 Jun, 2022 22:44 IST|Sakshi
పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్‌ఫొటో)

మార్కులు తగ్గాయని ఒత్తిడి పెంచొద్దు 

అంకెలు కాదు మార్పు ముఖ్యం 

పిల్లల్లో ధైర్యం నింపండి 

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి  

ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, అధికారులు  

జిల్లాలో టెన్త్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు : 23,752 

పరీక్షా కేంద్రాలు 153 

పరీక్షలు జరిగిన తేదీలు  ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు  

మదనపల్లె సిటీ:  కోవిడ్‌ మహమ్మారితో రెండు సంవత్సరాలుగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు సజావుగా నిర్వహించారు. ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు  ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి.  

అనంతరం మూల్యాంకనాన్ని శరవేగంగా పూర్తి చేశారు. ఈ కసరత్తు పూర్తి కావడంతో  జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర స్థాయిలో  ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలు 153 కేంద్రాల్లో నిర్వహించగా 23,752 మంది విద్యార్థులు హాజరయ్యారు.  

దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు విడుదలవుతుండటంతో పిల్లలకు మార్కులు ఎలా వస్తాయోనని తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరో వైపు జిల్లా ఏ స్థానంలో నిలుస్తుందోనని అ«ధికారుల్లో సైతం ఆసక్తి నెలకొంది. గతంలో పరీక్షలలో మార్కులు తగ్గాయంటూ చాలా మంది పిల్లలు అ«çఘాయిత్యాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి.

పిల్లలు ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలూ లేకపోలేదు. కనిపెంచిన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చిన సందర్భాలు కనిపించేవి. ఈ నేపథ్యంలో సోమవారం పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతున్నాయి. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రుల బాధ్యత తదితర అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక వైద్యనిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.  

ఫలితాలు ర్యాంకులే జీవితం కాదు 
జీవితంలో పరీక్షా ఫలితాలు వాటి ర్యాంకులే ముఖ్యం కాదు. కాలం, ప్రాణాన్ని మించి ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఓటమి గెలుపునకు తుదిమెట్టు అన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించుకోవాలి. ఫలితాలు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యపడుతుంది.  

క్షణికావేశానికి లోనుకావద్దు 
పది పరీక్షల ఫలితాలు వచ్చిన సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనుకాకూడదు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగితే జీవిత లక్ష్యాలను చేరుకోవచ్చు. మార్కులు తక్కువ వచ్చాయని ఒత్తిడికి గురై క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని బుగ్గిపాలు చేస్తాయి. ఒక్క నిమిషం ఆలోచిస్తే సమస్య పరిష్కారానికి పలు మార్గాలు లభిస్తాయి.  
–ఎల్‌.బి.మహేష్‌నారాయణ, విద్యావేత్త, మదనపల్లె 

భయాందోళనకు గురిచేయవద్దు 
పది ఫలితాల వ్యత్యాసం చూపుతూ పిల్లల్ని భయాందోళనలకు గురి చేయరాదు. విద్యార్థులు కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పది పరీక్షలే జీవితాన్ని నిర్దేశించే పరీక్షలేమి కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.  
–డాక్టర్‌ ఆంజనేయులు, సూపరింటెండెంట్,  జిల్లా ఆస్పత్రి, మదనపల్లె

ప్రోత్సహించండి 
మార్కులు తక్కువ వచ్చాయని అఘాయిత్యాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. ఉద్యోగాలు సాధించేందుకు, ఉన్నత చదువులకు వెళ్లేందుకు మార్కులు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. నైపుణ్యాలు పెంచుకుని భవిష్యత్తులో మంచి ప్రతిభ కనబరిస్తే సరిపోతుంది. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి.     
–ఎం.జయకుమార్, సైకాలజిస్టు, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె

మరిన్ని వార్తలు