నగదు బదిలీతో అన్నదాతకే అధికారం

12 Sep, 2020 04:59 IST|Sakshi

ఉచిత విద్యుత్‌పై ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది 

ఇంధనశాఖ కార్యదర్శితో భేటీలో ఈఈఎస్‌ఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ సౌరబ్‌ కితాబు 

సాక్షి, అమరావతి: నగదు బదిలీతో సరికొత్తగా అమలు కానున్న వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకం అన్నదాతలకు నిజమైన అధికారాన్ని కల్పిస్తుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ సౌరబ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇది డిస్కమ్‌లను బలోపేతం చేసి రైతులకు సాధికారత తెస్తుందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లితో సమావేశం సందర్భంగా సౌరబ్‌ కుమార్‌ ఈ మేరకు అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

అన్ని అంశాల్లో సహకారం అందిస్తాం.. 
► పంపుసెట్లకు మీటర్లు లేకపోవడం వల్ల వ్యవసాయ వినియోగంపై కచ్చితమైన లెక్కలు అందుబాటులో లేక రైతులకు నాణ్యమైన సేవలు అందడం లేదని సౌరబ్‌ కుమార్‌ పేర్కొన్నారు. డిస్కమ్‌ల సాంకేతిక, వాణిజ్య నష్టాలను వాస్తవంగా చూపించకుండా కొంత మొత్తాన్ని వ్యవసాయ విద్యుత్‌ వినియోగంలో కలుపుతున్నారన్నారు. నగదు బదిలీ పథకం అమలుతో విద్యుత్‌ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్, స్మార్ట్‌ మీటరింగ్‌తో పాటు అన్ని అంశాల్లోనూ ఈఈఎస్‌ఎల్‌ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. 

ఉచితానికి రూ.8 వేల కోట్లు 
► రైతులపై పైసా భారం లేకుండా, లోవోల్టేజీ లేకుండా ఉచిత విద్యుత్‌ అందించే ప్రణాళికను ఇంధనశాఖ అధికారులు సౌరబ్‌ కుమార్‌కు వివరించారు. బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే వారి ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. మీటర్లు అమర్చటం వల్ల విద్యుత్‌ లోడు నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.8 వేల కోట్లు కేటాయించిందన్నారు. పగటిపూటే 9 గంటల  ఉచిత విద్యుత్‌ సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, మరో 30 ఏళ్లు ఈ పథకానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు, అదనపు లోడు  వ్యవసాయ కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు.

రూ.1,700 కోట్లతో ఫీడర్ల బలోపేతం 
► పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు ఫీడర్ల బలోపేతానికి ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసిందని సౌరబ్‌కుమార్‌కు ఇంధనశాఖ కార్యదర్శి వివరించారు. 2019 మార్చి 31 నాటికి డిస్కమ్‌లకు పెండింగ్‌లో ఉన్న రూ.8,655 కోట్ల సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని, అప్పటివరకు విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.14,036 కోట్లను కూడా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.  

మరిన్ని వార్తలు