ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు

3 Sep, 2020 03:32 IST|Sakshi

రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులపై చర్చ

విద్యుత్‌ చార్జీలు రైతుల ఖాతాల్లో జమ 

ఆర్డీవో తరహాలోనే డీడీవో పోస్టులు

పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్‌

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

సాక్షి, అమరావతి: నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయమై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా వ్యయానికి సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుందని అధికార వర్గాల సమాచారం. 

– రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు డివిజన్‌ స్థాయిలో పని చేస్తున్న ఆర్‌డీవో (రెవెన్యూ డివిజినల్‌ ఆఫీసర్‌) తరహాలోనే.. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీడీవో) పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 
– ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై గురువారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులు రానున్నాయి. 
 
నేడు కేబినెట్‌ భేటీ
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 
– ఈ సమావేశంలో ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొన్ని ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు