జానపాడు టు సౌత్‌ కొరియా.. ఓ యువకుడి విజయగాధ 

25 Aug, 2021 08:47 IST|Sakshi
సౌత్‌ కొరియాలోని కొరియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ప్రాంగణంలో పసుపులేటి లక్ష్మీనారాయణ

ట్రిపుల్‌ఐటీలో బీటెక్‌ పూర్తి 

‘మెటలర్జీ’పై ఆసక్తితో సౌత్‌ కొరియా వర్సిటీలో పరిశోధన సీటు 

చార్జీల కోసం కమ్మలు అమ్మి డబ్బుల్చిన తల్లి 

నేడు పీహెచ్‌డీ పట్టా అందుకోనున్న లక్ష్మీనారాయణ 

సాక్షి, అమరావతి బ్యూరో: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందు చూపు, తల్లిదండ్రుల ఆకాంక్షకు తోడు కృషి, పట్టుదల ఓ యువకుడిని అందలం ఎక్కించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులోని ఓ పేద కుటుంబానికి చెందిన పసుపులేటి లక్ష్మీనారాయణ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొగ్గ తొడిగి సౌత్‌ కొరియాలోని జియోన్‌గ్సాంగ్‌ నేషనల్‌ యూనివర్సిటీలో వికసించాడు. కొరియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ సైన్స్‌లో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఈ నెల 25న పీహెచ్‌డీ పట్టా అందుకోనున్నాడు. ‘మా పిల్లల జీవితం మాలాగ సున్నపుబట్టీలో మగ్గిపోకూడదు’ అనుకున్న ఇతని తల్లిండ్రులు కష్టపడి టెన్త్‌ వరకు చదివించారు. అనంతరం ట్రిపుల్‌ ఐటీలో ఇతనికి సీటు వచ్చింది.

ఆరేళ్లు అన్నీ ఉచితమే.. 
2019లో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో చేరిన లక్ష్మీ నారాయణ ఇంటర్, బీటెక్‌ అక్కడే పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకునే వరకు తల్లిదండ్రులకు రూపాయి ఖర్చు కాలేదు. మెటలర్జీ సబ్జెక్టుపై పరిశోధన పట్ల ఇతడికి ఆసక్తి. ఇదే ఊరి నుంచి సౌత్‌ కొరియా వెళ్లి పరిశోధన చేస్తున్న హరిబాబు మార్గదర్శనంతో అక్కడి యూనివర్సిటీలలో పీజీ, పీహెచ్‌డీ సీటు కోసం దరఖాస్తు చేశాడు. స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అయితే సౌత్‌ కొరియాకు వెళ్లడానికి డబ్బు కావాలి. ఇందుకోసం ఇతని తల్లి చెవి కమ్మలు తీసి అమ్మింది. ఆ మొత్తం సరిపోదు. దీంతో దొరికన చోట శక్తికొద్దీ అప్పు తెచ్చాడు తండ్రి.

మొత్తం రూ.30 వేలు చేతిలో పెట్టారు. ‘చాలా మందికి అది చాలా చిన్న మొత్తమే కావచ్చు. నాకు మాత్రం అది కోటానుకోట్ల కంటే ఎక్కువ. అమ్మ చెవి కమ్మలు తీస్తుంటే బాధ అనిపించింది. ఒద్దు అని చెప్పలేని పరిస్థితి. ఆ డబ్బుతో తొలిసారి విమానం ఎక్కాను. ఏడాదిన్నరలో అప్పులు తీర్చాను. కొత్త కమ్మలు కొనుక్కోవడానికి అమ్మకు డబ్బులు పంపాను. ఈ రోజు నా విజయం వెనుక నా తల్లిదండ్రులు, మహానేత వైఎస్సార్, నాకు సీటు కోసం రికమెండ్‌ చేసిన జింజు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుబ్బారెడ్డిలను మరచిపోలేను’అని లక్షీనారాయణ చెప్పారు.  

ఎంతో మందికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం 
ఆరేళ్లలో 23 పబ్లికేషన్‌లు సమర్పించాను. మెటలర్జీలో టైటానియం త్రీడీ ప్రింటింగ్‌లో సాగుతున్న నా పరిశోధనలు ఏరోస్పేస్‌ రంగంలో, వైద్య విభాగంలో మంచి ఆవిష్కరణలు కానున్నాయి. గుండె వాల్వులు, మోకీలుకు, బోన్‌ రీప్లేస్‌మెంట్‌కు అమర్చే లోహపు పరికరాల తయారీలో మంచి ఫలితాలనిస్తాయి. ఏరో స్పేస్‌లో పెద్ద మెషినరీలో రిపేర్‌ వస్తే ఆ యంత్రాన్ని డిస్‌మాంటిల్‌ చేయాల్సిన పని లేకుండా పని చేయని భాగానికి మాత్రమే మరమ్మతు చేయడం సాధ్యమవుతుంది. నా మేధస్సుతో ఎంతో మందికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం.  
– లక్ష్మీనారాయణ

మరిన్ని వార్తలు