తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా

7 Oct, 2020 05:38 IST|Sakshi
సాయితేజ

టాప్‌–10లో ఐదుగురు మన విద్యార్థులే

సాక్షి, అమరావతి/విజయనగరం అర్బన్‌/గుడివాడ టౌన్‌: తెలంగాణ ఎంసెట్‌–2020లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ఫలితాలు విడుదలవ్వగా.. టాప్‌–10 ర్యాంకుల్లో అయిదింటిని ఏపీ విద్యార్థులే దక్కించుకున్నారు. రెండో ర్యాంక్‌ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కాపెల్లి యశ్వంత్‌సాయికి రాగా.. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన టి.మణివెంకటకృష్ణ మూడో ర్యాంకును సాధించాడు. కృష్ణా జిల్లా గుడివాడ గౌరీశంకరపురానికి చెందిన టి.కృష్ణ కమల్‌ 7వ ర్యాంక్‌ను, గుంటూరుకు చెందిన పెనగమూరి సాయిపవన్‌ హర్షవర్థన్‌ 9వ ర్యాంక్‌ను, విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన వారణాసి వచన్‌ సిద్దార్థ్‌ 10వ ర్యాంకును సాధించారు. 

ఫస్ట్‌ ర్యాంకర్‌ మనోడే.. 
విజయనగరానికి చెందిన వారణాసి సాయితేజ తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడు. తల్లిదండ్రులు విజయరామయ్య, శాంతకుమారి విజయనగరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్‌ టీచర్లుగా పనిచేస్తుండగా.. సాయితేజ హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుకున్నాడు(విద్యార్థి చిరునామాను రంగారెడ్డి జిల్లా, తెలంగాణగా ఫలితాల జాబితాలో పేర్కొన్నారు). తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ లభించడం ఆనందంగా ఉందని సాయితేజ చెప్పాడు. కంప్యూటర్‌ సైన్స్‌ చదివి అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. 

చిరు వ్యాపారి కుమారుడికి టాప్‌ ర్యాంక్‌ 
గుడివాడకు చెందిన టి.ఈడీఎన్‌వీఎస్‌ కృష్ణకమల్‌ తెలంగాణ ఎంసెట్‌లో 7వ ర్యాంక్‌ సాధించాడు. కృష్ణ కమల్‌ తండ్రి చిరు వ్యాపారి కాగా.. తల్లి గృహిణి. తెలంగాణ ఎంసెట్‌లో టాప్‌–10లో నిలిచినందుకు సంతోషంగా ఉందని కృష్ణకమల్‌ చెప్పాడు. జేఈఈ కూడా రాశానని.. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివినట్లు తెలిపాడు.  
కృష్ణ కమల్‌కు స్వీటు తినిపిస్తున్న కుటుంబసభ్యులు 

మరిన్ని వార్తలు