రాజస్తాన్‌లోనూ ఏపీ తరహా రైతు సేవలు

16 Mar, 2023 04:23 IST|Sakshi

అమలుకు కృషి చేస్తామన్న రాజస్తాన్‌ ఉన్నతాధికారులు

సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్‌ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్‌ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్‌ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికా­రుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్‌ మార్కెటింగ్‌ చీఫ్‌ మేనేజర్‌ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికా­రులు అజయ్‌కుమార్‌ పచోరి, రాకేశ్‌ కుమార్‌ అతల్, దన్వీర్‌ వర్మ, తారాచంద్‌ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు.  రాజస్తాన్‌లోని కాల్‌ సెంటర్‌ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

ఆర్బీకే చానల్‌ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్‌ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్‌ డైరెక్టర్‌ వల్లూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు