విద్య, వైద్యంలో ఏపీ విధానం అద్భుతం

14 Oct, 2022 03:32 IST|Sakshi
బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌కు జ్ఞాపిక అందజేస్తున్న మంత్రి రజిని

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ విన్‌ ఓవెన్‌ వెల్లడి

సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఈ రంగాల్లో అభివృద్ధి.. 104, 108 కాల్‌ సెంటర్‌ వ్యవస్థ బాగుంది

బ్రిటన్‌లోనూ వీటిని అమలు చేస్తాం.. బ్రిటిష్‌ జర్నల్‌లో ప్రచురిస్తాం

ఫ్యామిలీ డాక్టర్‌ విధానానికి సహకారం అందిస్తాం.. అత్యాధునిక క్యాన్సర్‌ వైద్యానికి మేమూ సహకరిస్తాం

17 వైద్య కళాశాలల నిర్మాణం ప్రశంసనీయం.. వైద్య శాఖ మంత్రి రజినితో డిప్యూటీ హైకమిషనర్‌ బృందం 

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతమని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ హెచ్‌ ఈ గారెత్‌ విన్‌ ఓవెన్‌ చెప్పారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని 104, 108 కాల్‌ సెంటర్లను సందర్శించానని, అవి అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఇలాంటి వ్యవస్థలను బ్రిటన్‌లోనూ నెలకొల్పేలా చూస్తామన్నారు.

బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో 104, 108 కాల్‌సెంటర్ల గురించి ప్రచురిస్తామన్నారు. బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్, ఆయన బృందం గురువారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఏపీఈడీబీ సీఈవో డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తాతో విడివిడిగా సమావేశమైంది. రాష్ట్రంలో విద్య వైద్య రంగాలపై చర్చించి, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడించింది. 

ఈ బృందం మంత్రి విడదల రజినితో మంగళగిరిలోని ఆమె కార్యాలయంలో భేటీ అయింది. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి రజిని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైద్య రంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేయనున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

అమ్మ ఒడి, విద్యా దీవెన, ఆరోగ్య శ్రీ సహా పలు కార్యక్రమాలతో విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్‌ సమూల మార్పులు తెస్తున్నారని వివరించారు. యూకేలోనూ ఫ్యామిలీ డాక్టర్‌ లాంటి విధానాన్నే అమలు చేస్తున్నట్లు ఓవెన్‌ చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానానికి సహకారం అందిస్తామని అన్నారు. ఏపీ ప్రభుత్వం క్యాన్సర్‌ వైద్యంలో అత్యాధునిక పద్ధతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, తాము కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

కొత్తగా 17 వైద్య కళాశాలలను నిర్మిస్తుండటం ప్రశంసనీయమన్నారు. యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌పై వచ్చే నెల 25, 26 తేదీల్లో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగే  సదస్సులో తామూ భాగమవుతామని వెల్లడించారు. ఏపీలో ఆరోగ్యశ్రీ ద్వారా 85 శాతం కుటుంబాలకు పూర్తి ఉచితంగా వైద్యం అందిస్తుండటం హర్షణీయమని అన్నారు. యూకే – భారత్‌ విద్యార్థుల పరస్పర మార్పిడి విధానం వల్ల భారత యువతకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు.

ముఖ్యంగా వైద్య విద్యలో అత్యాధునిక విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు పట్టు లభిస్తుందన్నారు. ఏపీ నుంచి ఎక్కువ మంది విద్యార్థులకు బ్రిటన్‌ వీసాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్‌ నవీన్‌కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ నివాస్, ఏపీవీవీపీ కమిషనర్, ఇన్‌చార్జి డీఎంఈ డాక్టర్‌ వినోద్‌ కుమార్, బ్రిటిష్‌ కమిషనరేట్‌ నుంచి డిప్యూటీ హెడ్‌ ఆఫ్‌ మిషన్‌ వరుణ్‌ మాలి, పొలిటికల్‌ ఎకానమీ అడ్వైజర్‌ నళిని రఘురామన్‌ తదితరులు పాల్గొన్నారు. 

విద్యా పథకాలకు ప్రశంసలు 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలను గారెత్‌ విన్‌ ఓవెన్‌ బృందం ప్రశంసించింది. ఈ బృందం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె. హేమచంద్రారెడ్డితో భేటీ అయింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత 3 సంవత్సరాల్లో చేపట్టిన  కార్యక్రమాలను హేమచంద్రారెడ్డి వివరించారు. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానం, విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్, దాని వల్ల ప్రయోజనాలను చెప్పారు.

రాష్ట్రం  బ్లెండెడ్‌  మోడ్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ దిశగా పయనిస్తోందని, ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలతో మారుమూల ప్రాంతాలకు విజ్ఞానం వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు, ప్రయోజనాలను తెలుసుకుని బృందం సభ్యులు ఆశ్చర్యపోయారు. క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డ్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డ్, స్టేట్‌ రీసెర్చ్‌ బోర్డ్, రీజినల్‌ క్లస్టర్‌  గ్రూప్‌ల గురించి మొదటిసారి విన్నామన్నారు.

9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ కోసం నమోదు చేసుకోవడం, 3.5 లక్షల మంది ఇంటర్న్‌షిప్‌ ప్రారంభించబోతుండటంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మార్పు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పరిశోధన రంగాలపై బ్రిటన్‌ ఆసక్తి 
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యంపై బ్రిటన్‌ ఆసక్తిని వ్యక్తంచేసింది. విశాఖపట్నంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇండస్ట్రీ 4.0లో భాగస్వామ్యానికి బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌  సానుకూలత వ్యక్తంచేశారు. ఏపీఈడీబీ సీఈవో డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తాని కలిసి రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో భాగస్వామ్యానికి గారెత్‌ ఆసక్తిని కనబరిచారు. 

ఏపీ విద్యా విధానం భేష్‌ 
– గవర్నర్‌తో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఓవెన్‌ 
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నారని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ చెప్పారు. ఆయన రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో విజయవాడలోని రాజ్‌భవన్‌లో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు, శ్రీహరికోటలోని ఉపగ్రహ ప్రయోగ కేంద్రం మొదలైన వాటి గురించి గవర్నర్‌ ఆయనకు వివరించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, భారత్‌లో అమలవుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నారు. 

మరిన్ని వార్తలు